ఆ అధికారి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు... చైనా టెన్నిస్ ప్లేయర్ మిస్సింగ్‌పై...

By Chinthakindhi Ramu  |  First Published Nov 20, 2021, 11:57 AM IST

చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఓ ఉన్నతాధికారితో తనకు వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన పెంగ్ షువాయి... అప్పటి నుంచి తెలియని టెన్నిస్ ప్లేయర్ ఆచూకీ..


Where is Peng Shuai? (పెంగ్ షువాయి ఎక్కడ ఉంది?)... టెన్నిస్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేస్తున్న ప్రశ్న ఇది. డబుల్స్‌లో వరల్డ్ నెం.1 ర్యాంకును అందుకున్న టెన్నిస్ వుమెన్ ప్లేయర్ పెంగ్, ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉంది? ఆమెకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు... 35 ఏళ్ల చైనీస్ టెన్నిస్ ప్లేయర్ పెంగ్ షువాయి, 2010 ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్‌లో, వుమెన్ సింగిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. డబుల్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. అలాగే 2014లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్‌, 2013లో వింబుల్డన్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది...

Read: ధోనీ ఆపేశాడు, రాహుల్ ద్రావిడ్ మళ్లీ మొదలెట్టాడు... అజిత్ అగార్కర్ నుంచి హర్షల్ పటేల్...

Latest Videos

undefined

కొన్నాళ్ల క్రితం పెంగ్ షువాయి, చైనాకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ అధికారి, తనను లైంగికంగా వేధిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే పెంగ్ షువాయి కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనా గవర్నమెంట్‌‌లోని కొందరు పెద్దలే, పెంగ్ షువాయిని కిడ్నాప్ చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు జనాలు...

ప్రభుత్వాధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత పెంగ్ షువాయికి అక్కడ టెన్నిస్ అభిమానుల నుంచి విశేషమైన స్పందన, సపోర్ట్ వచ్చింది. టెన్నిస్‌ క్రీడను కాపాడాలంటూ ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నట్టు సోషల్ మీడియాలో జనాలు స్పందించారు. అయితే ప్రభుత్వం మాత్రం పెంగ్ షువాయి లైంగిక ఆరోపణల ఇష్యూని ప్రసారం చేయకూడదని మీడియాకి హెచ్చరికలు జారీ చేసింది. పెంగ్ షువాయికి సంబంధించిన ఏ వార్తలనైనా నిషేధించాలంటూ సూచనలు చేసింది..

అయితే పెంగ్ షువాయి అధికారిక మెయిల్ ఐడీ నుంచి వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ సీఈవో, ప్రెసిడెంట్ స్టీవ్ సిమాన్‌కి ఓ మెసేజ్ వచ్చినట్టు సమాచారం. తాను క్షేమంగానే ఉన్నానని, చైనా ప్రభుత్వ మాజీ అధికారిపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆ మెయిల్‌లో పెంగ్ షువాయి పేర్కొన్నట్టు స్టీవ్ సిమాన్ తెలియచేశాడు... అయితే ఈ మెయిల్ పెంగ్‌ పంపినదేనా లేక ఎవరైనా ఆమెను బెదిరించి, ఇలా చేయించారా? అనేది తేలాల్సి ఉంది...

టెన్నిస్ స్టార్ ప్లేయర్ కనిపించకుండా పోయినా అక్కడి మీడియా కానీ, ప్రభుత్వాధికారులు కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. 2021, నవంబర్ 2న విబో అనే మైక్రోబ్లాగ్ అకౌంట్‌లో మాజీ సీనియర్ చైనీస్ వైస్ ప్రీమియర్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ హై ర్యాంకింగ్ మెంబర్ అయిన జాంగ్ గావోలీ, తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది పెంగ్ షువాయి. జాంగ్ గావోలీకి తనకి మధ్య వివాహేతర సంబంధం కూడా ఉందని, బలవంతంగా తనను లోబర్చుకుని, ఇప్పుడు వేధిస్తున్నాడని ఆరోపించింది పెంగ్ షువాయి.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) కి చెందిన ఓ ఉన్నతాధికారిపై ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కావడంతో చైనాలో పెద్ద దుమారమే రేగింది. మీడియా ఈ విషయాన్ని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో ‘మీటూ’ మూమెంట్ జోరుగా సాగింది.

అయితే ఆ పోస్టు చేసిన 20 నిమిషాలకే దానని డిలీట్ చేసింది పెంగ్ షువాయి. అయితే అప్పటికే చాలామంది నెటిజన్లు, ఆమె పోస్టును స్కీన్‌షాట్ తీయడంతో ఆ వార్త వైరల్ అయ్యింది.. ఈ విషయానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులపై కూడా నిషేధం విధించింది చైనా ప్రభుత్వం. నవంబర్ 18 నుంచి సోషల్ మీడియాలో పెంగ్ షువాయి ఆచూకీ లేకపోవడంతో ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

click me!