రెజ్లర్ల పోరాటంలో మరో ట్విస్ట్.. బ్రిజ్ భూషణ్‌తో తమకు అలాంటిదేమీ జరగలేదన్న అథ్లెట్లు..! మరి ధర్నా ఎందుకు?

By Srinivas M  |  First Published Jan 20, 2023, 9:47 PM IST

WFI Controversy: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు  బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తో పాటు జాతీయ కోచ్‌లు తమను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించిన  రెజ్లర్ల ఆందోళనలో  కీలక మలుపు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో వాళ్లు కీలక విషయాలపై చర్చించారు. 


భారత రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా దేశంలోని స్టార్ రెజ్లర్లు  చేస్తున్న పోరాటంలో కీలక మలుపు.  శుక్రవారం  మరో దఫా కేంద్ర  క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో  సమావేశమైన  రెజ్లర్లు ఆయనతో కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తున్నది. రెజ్లర్ల పోరాటానికి మొదట్నుంచి  కర్త, కర్మ, క్రియగా ఉంటున్న  స్టార్  రెజ్లర్ వినేశ్ పోగట్ తో పాటు భజరంగ్ పునియా, బబితా పోగట్, సాక్షి మాలిక్  లు సుమారు నాలుగు గంటల పాటు అనురాగ్ ఠాకూర్ తో సమావేశమయ్యారు.  

ఈ సందర్భంగా మంత్రి  రెజ్లింగ్ ప్రతినిధులతో.. ‘మీకు బ్రిజ్ భూషణ్‌తో ఏమైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయా..?’ అని అడగగా రెజ్లర్లు.. ‘లేదు. మాకు అలాంటివేమీ కలుగలేదు.   కానీ మేమైతే  అలాంటి ఆరోపణలు విన్నాం..’ అని చెప్పారని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల ద్వారా తెలుస్తున్నది.  కాగా, ఠాకూర్ తో  సమావేశమైన వారిలో వినేశ్ పోగట్ కూడా ఉండటం గమనార్హం. బ్రిజ్ భూషణ్ పై  పోరాటం లేవనెత్తిందే వినేశ్...

Latest Videos

undefined

అయితే  రెజ్లింగ్ ప్రతినిధులు  తనతో వారి సమస్యలు చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అయితే  క్రీడా   శాఖ సెక్రటరీ  సుజాత చతుర్వేదితో  నిర్మొహమాటంగా చెప్పొచ్చని  అనురాగ్ ఠాకూర్  వారికి సూచించినట్టు  సమాచారం. 

రెజ్లర్లు..  ఠాకూర్ తో ముఖ్యంగా బ్రిజ్ భూషణ్ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ  ఆయనను తొలగించాలని  ప్రధానంగా డిమాండ్ చేసినట్టు  విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.  దీనికి ఠాకూర్  సానుకూలంగా స్పందించారని.. అలాగే  లైంగిక వేధింపులకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తామని  ప్రతినిధులకు హామీ ఇచ్చినట్టు క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి.  

మీడియాతో ముచ్చట్లొద్దు : బ్రిజ్ భూషణ్ కు  ఠాకూర్  హెచ్చరిక..? 

రెండ్రోజులుగా దేశంలోని స్టార్ రెజ్లర్లు తనపై చేస్తున్న ఆరోపణలపై  వివరణ ఇచ్చేందుకు గానే  బ్రిజ్ భూషణ్ వాస్తవానికి నేడు (శుక్రవారం) విలేకరుల సమావేశం పెట్టాలని భావించారు. ఆ మేరకు ఆయన ఫేస్బుక్ లో..  తనపై రాజకీయ కుట్రలోనే ఇదంతా జరుగుతుందని,  ఆ వివరాలను నేడు 4 గంటలకు మీడియా సమావేశంలో బయటపెడతానని  అందులో పేర్కొన్నారు. అయితే  ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం ఇరుకున పడింది.   మళ్లీ బ్రిజ్ భూషణ్ ఏం మాట్లాడితే ఏమౌతుందోననే  ఆందోళనతో   స్వయంగా అనురాగ్ ఠాకూర్.. ఆయనకు ఫోన్ చేసి మీడియా  సమావేశం పెట్టొద్దని సూచించినట్టు సమాచారం.  దీంతో  ఆయన మీడియా ముందుకు రాలేదు. అయితే ఆయన కొడుకు మాత్రం.. తన తండ్రి  జనవరి 22న మీడియా ముందుకు వస్తారని తెలపడం గమనార్హం. 

click me!