
టీ20 మహిళా ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. ఇప్పటికే లీగ్ మ్యాచులన్నింటిలో విజయం సాధించిన మహిళా జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో భారత మహిళా జట్టుకు అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా అండగా నిలుస్తున్నారు. అందులోభాగంగా టీంఇండియా పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భారతీయ మహిళా జట్టుకు సపోర్ట్ గా నిలిచాడు. తానొక్కడే కాకుండా బ్లూ జెర్సీ ఛాలెంజ్ పేరుతో ఇతర ఆటగాళ్లను కూడా ఈ ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తున్నాడు.
కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి మహిళా జట్టుకు స్పూర్తిని నింపడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి కోహ్లీ ప్రస్తావించాడు. మహిళా క్రికెట్ జట్టులోని అమ్మాయిలు బ్లూ జెర్సీ ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుత విజయాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ బ్లూ జెర్సీకి ఆడా, మగా అన్న బేధాలుండవని తెలిపాడు. కాబట్టి క్రికెట్్ అభిమానులతో పాటు యావత్ దేశ ప్రజలు టీ20 ప్రపంచ కప్ లో మహిళా జట్టుకు మద్దతివ్వాలని సూచించాడు.
ఇక తనలాగే భారత పుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ, క్రికెటర్ రిషబ్ పంత్, బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ కూడా ఇలాగే మహిళా జట్టుకు మద్దతు పలకాలని కోహ్లీ ఛాలెంజ్ విసిరాడు. వాళ్లు కూడా బ్లూ జెర్సీ ధరించి భారత జట్టుకు అండగా నిలవాలని కోరాడు.