Tokyo Olympics: మరోసారి నిరాశపర్చిన మహిళా షూటర్లు, క్వాలిఫయర్స్ లో ఓటమి

By team teluguFirst Published Jul 30, 2021, 7:54 AM IST
Highlights

భారత మహిళా షూటర్లు మను బాకర్,రాహి సర్నోబాత్ లు పిస్టల్ షూటింగ్ ఈవెంట్ లో నిరాశపరిచారు. 

భారత మహిళా షూటర్లు మను బాకర్,రాహి సర్నోబాత్ లు పిస్టల్ షూటింగ్ ఈవెంట్ లో నిరాశపరిచారు. నిన్నటి ప్రెసిషన్ రౌండ్ తరువాత నేడు జరిగిన రాపిడ్ స్టేజిలో వారు అధిక పాయింట్లను సాధించలేక ఫైనల్ కి అర్హత సాధించలేకపోయారు. మను 582 పాయింట్లను సాధించినప్పటికీ... అర్హత సాధించలేకపోయింది. అదే గత ఒలింపిక్స్ లో అయితే ఈ స్కోర్ కి సులువుగా అర్హత సాధించి ఉండేది. టోక్యోలో కాంపిటీషన్ ఏ లెవెల్ లో ఉందొ దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. 

25 మీటర్ల పిస్టల్ కేటగిరిలో ప్రెసిషన్ స్టేజి, రాపిడ్ స్టేజి అని రెండు భాగాలుగా క్వాలిఫయర్స్ జరుగుతాయి. నిన్న జరిగిన ప్రెసిషన్ రౌండ్ లో మను 97,97,98 పాయింట్లను మూడు సిరీసుల్లో సాధించి మొత్తంగా 292 పాయింట్లను సాధించింది. మరో షూటర్ రాహి సర్నోబాత్ 97,97,93 పాయింట్లను మూడు సిరీసుల్లో సాధించి మొత్తంగా 287 పాయింట్లు సాధించింది. 

ఇక నేడు జరిగిన రాపిడ్ స్టేజిలో రాహి సర్నోబాత్ 96,94,96 లను మూడు సిరీసుల్లో సాధించడంతో రహి పోరు ముగిసిపోయింది. ఇక మరో షూటర్ మను బాకర్ ఫస్ట్ సిరీస్ లో 96 పాయింట్లను స్కోర్ చేసింది. రెండవ సిరీస్ లో 97,మూడవ సిరీస్ లో కూడా 97 పాయింట్లను సాధించి మొత్తంగా రాపిడ్ లో 290 పాయింట్లను దక్కించుకుంది. 

మరొక సిరీస్ ఉండగానే భారత షూటర్ల కన్నా ముందు 8 మందికన్నా ఎక్కువ ఉండడంతో వారి పోరాటం ముగిసింది. రాహి సర్నోబాత్ తన సాధారణ ఆటను ఇక్కడ ఆడలేకపోయింది. మను చివరి వరకు ప్రయత్నం చేసినప్పటికీ... అది సాధ్యపడలేదు. ఇటీవల నెల కింద ముగిసిన ఒక ఈవెంట్లో మను 300 పాయింట్లకు గాను 296 పాయింట్లు స్కోర్ చేసింది. ఈ పరిస్థితుల్లో అనవసర 8 పాయింటర్లను కట్ చేయలేకపోవడం అభిమానులను బాధిస్తుంది. 

ఇప్పటివరకు పిస్టల్ ఈవెంట్లో భారత్ ఒకేఒక్క పతకాన్ని సాధించింది. 2012 ఒలింపిక్స్ లో షూటర్ విజయ్ కుమార్ సాధించిన సిల్వర్ మెడల్ తప్ప, మరో మెడల్ ని భారత్ సాధించలేదు. ఈసారైనా ఈ కరువు తీరుతుందని అంతా భావించినప్పటికీ... మళ్ళీ నిరాశే మిగిలింది. 

click me!