Tokyo Olympics: మరోసారి నిరాశపర్చిన భారత మహిళా షూటర్లు,క్వాలిఫయర్స్ లో ఓటమి

By team teluguFirst Published Jul 25, 2021, 7:16 AM IST
Highlights

భారత మహిళా షూటర్లు యశస్విని, మను బాకర్ లు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్స్ కి చేరలేకపోయారు.

టోక్యోలో భారత్ తన రెండవ రోజు వేటను షూటింగ్ తో ఆరంభించింది. 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత్ తరుఫున మను బాకర్,యశస్విని దేశ్వాల్ నిరాశపరిచారు. ఫైనల్స్ లోకి దూసుకెళ్లలేకపోయారు. నిన్న షూటర్లు నిరాశపర్చిన తరువాత నేడు కూడా అదే తరహాలో మరోసారి నిరాశ ఎదురయింది. 

టాప్ 8లో నిలిచిన షూటర్లు మాత్రమే ఫైనల్స్ కి క్వాలిఫై అవనున్న నేపథ్యంలో భారత షూటర్లు మను,యశస్వినిలు 12,13 స్థానాల్లో నిలిచి తమ పోరాటాన్ని ముగించారు. ఇద్దరు ఓడినప్పటికీ... తమ పూర్తి స్థాయి ప్రదర్శనను చేసి ఆకట్టుకున్నారు. 

ప్రపంచ నెంబర్1, నెంబర్2 స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు షూటర్లపై భారత్ బోలెడు ఆశలు పెట్టుకుంది. తొలి సిరీస్ లో మను 98 పాయింట్లు సాధించింది. రెండవ రౌండ్లో ఆరు షాట్లలో నాలుగు 9 పాయింటర్లను సాధించిన మను ఒక 5 నిమిషాలపాటు తన పిస్టల్ తో ఇబ్బంది పడింది. రెండవ సిరీస్ లో ఈ టెక్నికల్ అవరోధం తరువాత రెండవ సిరీస్ లో 95 పాయింట్లను మాత్రమే సాధించింది.

తరువాతి మూడవ రౌండ్లో ఒక 8 పాయింటర్ షాట్, నాలుగు 9 పాయింటర్ షాట్స్ ని కాల్చడంతో 94 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. ఇక నాలుగవ రౌండ్లో 95 పాయింట్లను సాధించిన మను 5వ రౌండ్లో 98 పాయింట్లను సాధించింది. మొత్తంగా 575 పాయింట్లు సాధించి 12వ స్థానంతో సరిపెట్టుకుంది. 

మరో షూటర్ యశస్విని ఫస్ట్ సిరీస్ లో 94 పాయింట్లు సాధించింది. 10 షాట్లలో ఒక 8 పాయింటర్ షాట్ ని కాల్చడంతో 95 కి బదులు 94 పాయింట్లు సాధించింది. రెండవ సిరీస్ లో యశస్విని 98 పాయింట్లను సాధించి తన స్కోర్ ని పెంచుకుంది. కానీ మూడవ సిరీస్ లో యశస్విని మరొక్కసారి రెండు 8 పాయింటర్లను కాల్చడం ద్వారా మరొకసారి 94 పాయింట్లకే పరిమితమయింది.

నాలుగవ సిరీస్ లో యశస్వినీ 97 పాయింట్లను సాధించింది. 5వ రౌండ్లో యశస్విని 96 పాయింట్లను మాత్రమే సాధించి తన ఫైనల్ క్వాలిఫైయింగ్ ఛాన్సులను క్లిష్టతరం చేసుకుంది. 574 పాయింట్లతో యశస్విని 13వ స్థానంలో నిలిచింది. 

ఇద్దరు ప్రపంచ టాప్ ర్యాంకర్లు ఇలా ఫైనల్స్ కి కూడా చేరలేకపోవడంతో భారతీయుల ఆశలు అడియాశలయ్యాయి. ఇక తరువాత మరికాసేపట్లో పురుషుల స్కీట్ క్వాలిఫైయర్స్ లో అంగడి వీర్ సింగ్,అహ్మద్ ఖాన్ పోటీపడనున్నారు. 

ఇక నిన్న షూటర్లు సౌరభ్ చౌదరి ఫైనల్స్ లోకి ప్రవేశించినప్పటికీ... అక్కడ పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేక 7వ స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. ఇక మహిళా షూటర్లు నిన్నటి ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కూడా నిరాశపర్చిన విషయం తెలిసిందే. 

మీరాబాయి చాను నిన్న రజత పతకం సాధించి భారత ఖాతాను తెరిచింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో 84 కేజీలను ఎత్తిన మీరాభాయ్, రెండో ప్రయత్నంలో 87కేజీలు ఎత్తి... తొలి హాఫ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చైనా వెయిల్ లిఫ్టర్ హో జీహుయ్ 94 కేజీలు లిప్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. 

తొలి ప్రయత్నంలో 110 కేజీలు ఎత్తిన మీరాభాయ్ ఛాను, రెండో ప్రయత్నంలో 115 కేజీలను లిఫ్ట్ చేసి అదరగొట్టింది.  మూడో ప్రయత్నంలో 117 కేజీలను ఎత్తేందుకు చేసేందుకు ప్రయత్నం విఫలమైంది. చైనా వెయిట్ లిఫ్టర్ హో జీహుయ్ టాప్‌లో నిలిచి, స్వర్ణం సాధించింది.

2000 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తెలుగు అథ్లెట్ కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో మెడల్ సాధించిన భారత వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది మీరాభాయి ఛాను... వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది మీరాభాయి ఛాను...

click me!