ఏకైక క్రీడాకారిణి... పోర్బ్స్ జాబితాలో తెలుగు తేజం పివి.సింధు

By Arun Kumar PFirst Published Aug 7, 2019, 7:36 PM IST
Highlights

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పివి.సింధు అరుదైన ఘనత సృష్టించింది. పోర్బ్స్ విడుదలచేసిన అత్యధిక సంపాదన కలిగిన అంతర్జాతీయ క్రీడాకారిణిల్లో భారత్ నుండి చోటు దక్కించుకున్న ఏకైక క్రీడాకారిణిగా సింధు నిలిచింది.

ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో తెలుగు తేజం పివి సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.  రియో ఒలింపిక్స్  బ్యాడ్మింటన్  విభాగంలో ఆమె తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది. అయినప్పటికి రెండో స్థానంలో నిలిచి రజతాన్ని కైవసం చేసుకుని ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్టను నిలబెట్టింది. ఆ దెబ్బతో సింధు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలా ఆమె బ్రాండ్ వాల్యూ అంతకంతకు పెరుగుతూ ఏకంగా పోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకునే స్థాయికి చేరింది. 

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వార్షికాదాయం కలిగిన మహిళా క్రీడాకారుల జాబితాను పోర్బ్స్ ఇటీవల విడుదల చేసింది. 2018-19 సంవత్సరంలో వివిధ మార్గాల ద్వారా  క్రీడాకారిణిలకు వచ్చిన ఆదాయం ఆదారంగా ర్యాకింగ్స్ ఇచ్చారు. ఇందులో భారత్ నుండి కేవలం పివి సింధు ఒక్కరే టాప్ 15 లో చోటుదక్కించుకున్నారు. ఆమె 5.5 మిలియన్ డాలర్లతో 13వ స్థానంలో నిలిచింది. 

ఇక ఈ జాబితాలో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టాప్ లో నిలిచింది. ఆమె ఏకంగా 29.2 మిలియన్ డాలర్ల సంపాదన కలిగివున్నట్లు పోర్బ్స్ ప్రకటించింది. గతేడాది కూడా సెరెనా విలియమ్సే టాప్ లో నిలవడం విశేషం. 

ఇక పివి.సింధు విషయానికి వస్తే గతేడాది పోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో టాప్ 10లో చోటుదక్కించుకుంది. సింధు ప్రపంచవ్యాప్తంగా వున్న మేటీ క్రీడాకారిణిలను కూడా వెనక్కినెట్టి ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది మొత్తంలో సింధు ప్రదర్శన అంత గొప్పగా సాగడం లేదు. వరుసగా పలు చాంపియన్‌షిప్ లలో ఓడిపోవడంతో ఆమె బ్రాండ్ వాల్యూ తగ్గింది. దీంతో ఆదాయం కూడా తగ్గి టాప్ 10 లో చోటు దక్కించుకోలేకపోయింది.  

click me!