పోలీసుల చిత్రహింసల వల్లే అంగీకరించా: శ్రీశాంత్

By pratap reddyFirst Published Jan 31, 2019, 6:50 AM IST
Highlights

శ్రీశాంత్‌ను బుకీలు సంప్రదించిన మాట నిజమేనని, అయితే తను మాత్రం బుకీల బుట్టలో పడలేదని దీనికి సంబంధించి మలయాళంలో బుకీ–శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సంభాషణను లాయర్‌ కోర్టుకు అందించాడు. 

న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకే స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించానని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ చెప్పాడు. తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని అతను సుప్రీం కోర్టుకు తెలిపాడు. 2013 ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్‌ బోర్డు జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

దానిపై శ్రీశాంత్ న్యాయపోరాటం చేస్తున్నాడు. బుధవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్‌ ఈ కేసును విచారించింది. పోలీస్‌ చిత్రహింసల నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్‌ నిందను మోశాడని అతని లాయర్‌ కోర్టుకు వివరించారు.

శ్రీశాంత్‌ను బుకీలు సంప్రదించిన మాట నిజమేనని, అయితే తను మాత్రం బుకీల బుట్టలో పడలేదని దీనికి సంబంధించి మలయాళంలో బుకీ–శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సంభాషణను లాయర్‌ కోర్టుకు అందించాడు. మైదానంలో టవల్‌తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్‌కు సంజ్ఞగా భావించడం తగదని శ్రీశాంత్‌ తరఫు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదించారు. 

దానిపై న్యాయమూర్తులు స్పందిస్తూ - బుకీలు ఫిక్సింగ్‌కు పాల్పడమని సంప్రదించినపుడు క్రికెటర్‌ ఆ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఎందుకు తెలపలేదని లాయర్‌ ఖుర్షీద్‌ను ప్రశ్నించారు. దాన్ని బట్టి శ్రీశాంత్‌ ప్రవర్తన ఎలాంటిదనే విషయం తెలిసిపోతోందని బెంచ్‌ స్పష్టం చేసింది.   

click me!