ఇది అన్యాయం, నేను ఫైనల్ ఆడాల్సింది!... అంపైర్ తప్పిదంపై పీవీ సింధు ఆగ్రహం...

Published : May 02, 2022, 04:05 PM IST
ఇది అన్యాయం, నేను ఫైనల్ ఆడాల్సింది!... అంపైర్ తప్పిదంపై పీవీ సింధు ఆగ్రహం...

సారాంశం

ఆసియా ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో సెమీస్‌లో యమగూచి చేతిలో ఓడిన పీవీ సింధు... రెండో సెట్‌లో సర్వీస్ ఆలస్యం చేసిందని సింధుకి పెనాల్టీ విధించిన అంపైర్... వీడియో వైరల్...

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కాంస్య పతకం తర్వాత స్విస్ ఓపెన్ 2022 గెలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఆసియా ఛాంపియన్‌షిప్ 2022లో కాంస్య పతకం సాధించింది. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పీవీ సింధు, జపాన్ ప్లేయర్ యమగూచి చేతిలో 21-13, 19-21, 16-21 తేడాతో పోరాడి ఓడింది...

మొదటి సెట్‌ని భారీ తేడాతో కైవసం చేసుకున్న పీవీ సింధు, ఒకానొక దశలో రెండో సెట్‌లోనూ యమగూచిపై మంచి ఆధిక్యం సంపాదించింది. అయితే పీవీ సింధు ఆధిక్యం సాగుతున్న సమయంలో అంపైర్ చేసిన ఓ తప్పిదం కారణంగా మ్యాచ్ రిజల్ట్ మారిపోయింది...


మొదటి సెట్‌ను 21- 13 తేడాతో కైవసం చేసుకుంది పీవీ సింధు. ఆ తర్వాత రెండో గేమ్‌లోనూ 14-11 తేడాతో మంచి ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుందనే కారణంగా పీవీ సింధుకి ఓ పెనాల్టీ పాయింట్ విధించాడు అంపైర్... 

అంపైర్ నిర్ణయానికి షాక్‌కి గురైన పీవీ సింధు, వెంటనే వెళ్లి ఛీఫ్ రిఫరీకి రిఫర్ చేసింది. యమగూచి రెఢీగా లేకపోవడంతో తాను సర్వీస్ చేయలేదని, ఆమెను గమనించకుండా పెనాల్టీ ఎలా వేస్తారని నిలదీసింది... అయితే పీవీ సింధు వాదనను విన్న ఛీఫ్ రిఫరీ కూడా... పెనాల్టీని ఉపసంహరించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు...

ఈ సంఘటన తర్వాత తీవ్ర అసహనానికి గురై, మ్యాచ్‌పై ఫోకస్ కోల్పోయిన పీవీ సింధు... వరుస పాయింట్లు కోల్పోయి 19- 21 తేడాతో రెండో సెట్ కోల్పోయింది. దీంతో మ్యాచ్ మూడో సెట్‌ వరకూ వెళ్లడం, ఆఖరి సెట్‌లో పీవీ సింధు 16-21 తేడాతో ఓడి, సెమీస్ నుంచి ఇంటిదారి పట్టడం జరిగిపోయాయి...

మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మాట్లాడిన పీవీ సింధు... ‘నా విషయంలో చాలా అన్యాయం జరిగింది. ప్రత్యర్థి సిద్ధంగా లేనప్పుడు సర్వీస్ ఎలా చేయగలం. నేను సర్వీస్ చేయడానికి ఆలస్యమైందని చెప్పారు, మరి ఆమె సిద్ధంగా ఉందా? అది ఎందుకు గమనించలేదు. దీనిపై ఛీఫ్ రిఫరీకి రిఫర్ చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. అప్పటికే పెనాల్టీ వేశారు కదా అని సమాధానం ఇచ్చారు...  నేను ఫైనల్‌కి వెళ్లాల్సింది, కానీ మీ వల్ల సెమీ ఫైనల్‌లోనే ఓడిపోయాను... ’ అంటూ అంపైర్ల తీరుపై అసహనం వ్యక్తం చేసింది...

ఆసియా ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో పీవీ సింధుకి ఇది రెండో కాంస్య పతకం. ఇంతకుముందు 2014లో తొలిసారి కాంస్యం సాధించిన పీవీ సింధు, ఈసారి స్వర్ణం సాధిస్తుందనే భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టింది. అయితే అంపైర్ తప్పిదాల కారణంగా సెమీస్‌లోనే ఓడి, మరోసారి కాంస్యంతోనే సరిపెట్టుకుంది... అంపైర్ల నిర్ణయంపై ఆగ్రహాంతో ఆసియా ఛాంపియన్‌షిప్ పతకాల పోడియానికి కూడా పీవీ సింధు హాజరుకాలేదు.

సెమీస్‌లో ఓడడంపై అసహనం వ్యక్తం చేసినా సోషల్ మీడియాలో మాత్రం ఈ పతకంపై సంతృప్తి వ్యక్తం చేసింది పీవీ సింధు. ‘విపరీతమైన పోటీలో సాధించే మెడల్ ఎప్పుడూ ప్రత్యేకమే. దీని కోసం చాలా కష్టపడ్డాను.. తర్వాత దాని కోసం ఎదురుచూస్తున్నా...’ అంటూ ట్వీట్ చేసింది పీవీ సింధు... 

PREV
click me!

Recommended Stories

IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
IND vs ENG : ఇంగ్లండ్ వజ్రాయుధం.. ఆ ఒక్కడిని అడ్డుకుంటే భారత్ ఫైనల్‌కు చేరినట్టే !