Nikhat Zareen: ‘అమ్మా.. నువ్వు నా పెళ్లి గురించి మరిచిపో.. నాకోసం పెళ్లి కొడుకులు మన ఇంటి ముందు క్యూ కడతారు’

By Srinivas MFirst Published Aug 7, 2022, 9:45 PM IST
Highlights

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ -2022లో భాగంగా  తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ స్వర్ణం నెగ్గింది. సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన  నిఖత్.. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. 

సందర్భం  1 : ‘ఇప్పటికే ఇరుగు పొరుగు వాళ్లు  మన అమ్మాయి గురించి  నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నిఖత్‌ను మనం బాక్సింగ్ ఆటలోకి పంపి తప్పుచేశామని అందరూ చెప్పుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే  మన అమ్మాయికి పెళ్లి కాదు. తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారు..’ 12 ఏండ్ల వయసులో నిఖత్ జరీన్ బాక్సింగ్  పోటీలకు వెళ్తుండగా ఆమె తల్లి  పర్వీన్ ఆందోళన ఇది. పర్వీన్.. తన భర్త జమీల్ అహ్మద్ (నిఖత్ తండ్రి)తో నిఖత్‌కు ఈ ఆటలు వద్దని బతిమాలుకుంది. కానీ జమీల్ నచ్చజెప్పాడు. ‘నువ్వు నిఖత్ పెళ్లి గురించి అంత టెన్షన్ పడకు.  మన కూతురి గురించి ఈ ప్రపంచం మాట్లాడుకునే రోజు దగ్గర్లోనే ఉంది..’ అని పర్వీన్ తో అన్నాడు. 

సందర్భం 2 : కొద్దిరోజుల తర్వాత  అదే పర్వీన్ కూతురితో ‘నిఖత్.. నువ్విలా బాక్సింగ్ అంటూ  ఊర్లు పట్టుకుని తిరిగితే నీకు పెళ్లి ఎలా అవుద్ది..? నిన్ను ఎవరు చేసుకుంటారు.  సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటే నిన్ను చేసుకోవడానికి ఎవరొస్తారు..’ అని  తల్లి ఆవేదనను కూతురితో చెప్పుకుంది. దానికి నిఖత్ చెప్పిన సమాధానం విని ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ‘అమ్మా నువ్వు నా పెళ్లి గురించి మరిచిపో.. టెన్షన్ పెట్టుకోకు. నాకు పేరు వచ్చిందనుకో.. నా కోసం పెళ్లి కొడుకులు మనింటి ముందు క్యూ కడతారు..’ అని అమ్మతో చెప్పింది. 

తండ్రి ప్రోత్సాహంతో అద్భుతాలు.. 

ఈ రెండు సందర్బాలలో  పర్వీన్ ఆవేదన నిజమే అయినా నిఖత్ జరీన్ ఆమె తండ్రి జమీల్ లు మాత్రం తాము సాధించబోయే లక్ష్యాల మీద కచ్చితమైన నమ్మకంతో ఉన్నారు. తన కూతురు ఏదో ఒక రోజు ఛాంపియన్ కావడాన్ని ‘ఏ సంప్రదాయాలూ, ఆచారాలూ, మూఢ నమ్మకాలు ఆపవు’అని జమీల్ నమ్మాడు. అందరి మాదిరే  తన కూతురు కూడా ‘పరదా’ చాటునే ఆగిపోకుండా  ఆమెకు ‘స్వేచ్ఛ’నిచ్చాడు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో నిఖత్  ఇప్పుడు ప్రపంచాన్ని జయిస్తున్నది.  కానీ ఏనాడూ తన ‘హద్దులను’  దాటలేదు. శ్రమించింది. నెగ్గిన చోట ఒదిగి ఉంది. ఓడిన చోట తప్పులను తెలుసుకుంది.  

నేపథ్యమిదీ.. 

తెలంగాణ లోని ఇందూరు (నిజామాబాద్) కు చెందిన నిఖత్ జరీన్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నిఖత్..చిన్నప్పట్నుంచే ఆటల మీద ఆసక్తితో ఉండేది. కూతురు ఆసక్తిని గమనించిన  జమీల్.. నిజామాబాద్ లోని షంసముద్దీన్ దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడానికి శిక్షణనిప్పించాడు. బాక్సింగ్ మొదలుపెట్టిన ఆరు నెలలకే  ఆమె తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. 2010 లో కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లో  గోల్డ్ మెడల్ నెగ్గింది. కొద్దిరోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో కూడా పలు టోర్నీలలో పతకాలు నెగ్గింది. తర్వాత ఆమె.. విశాఖపట్నంలోని ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు దగ్గర శిక్షణ తీసుకుంది. 2010లోనే  ఈరోడ్ (తమిళనాడు) లో జరిగిన  నేషనల్ ఛాంపియన్స్ లో ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్’ అవార్డు పొందింది. 

 

🥊 her way to glory! does it in style with a 🥇 medal in the Women’s Boxing Light Flyweight category pic.twitter.com/el8ZWwHhNK

— Team India (@WeAreTeamIndia)

ప్రపంచ ఛాంపియన్‌గా..

కొద్దిరోజుల క్రితం ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) ఆధ్వర్యంలో  టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా ముగిసిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో  మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కు అర్హత సాధించి  తాజాగా ఇక్కడ కూడా స్వర్ణం గెలిచి.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు పతకం తేవడమే లక్ష్యంగా దూసుకుపోతున్నది. 

click me!