PM Modi: అల్మోరా ఫేమస్ స్వీట్ అడిగిన ప్రధాని.. అదే గిఫ్ట్ గా తెచ్చిన థామస్ కప్ విజేత

By Srinivas M  |  First Published May 22, 2022, 6:19 PM IST

Lakshya Sen: ఇటీవలే ముగిసిన థామస్ కప్ లో ఇండోనేషియా ను చిత్తుగా ఓడించిన భారత  బృందం ఆదివారం ప్రధాని మోడీని కలిసింది. ఈ సందర్బంగా మోడీ.. ఆటగాళ్లను పేరుపేరునా అభినందించారు. 


భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణధ్యయాన్ని లిఖిస్తూ గత వారం ముగిసిన థామస్ కప్ లో 14 సార్లు విజేత ఇండోనేషియా ను 3-0తో మట్టికరిపించిన భారత  జట్టు సభ్యులు ఆదివారం ప్రధాని మోడీని కలిశారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఆధ్వర్యంలోని ఆటగాళ్లు న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోడీని కలిశారు. విజేతలను అభినందించే క్రమంలో  మోడీకి లక్ష్య సేన్ నుంచి ఓ వినూత్న బహుమానం లభించింది. గతంలో ఆయన లక్ష్య సేన్ ను కోరిన కోరికను అతడు ఇప్పుడు నెరవేర్చాడు. లక్ష్య సేన్ స్వస్థలమైన అల్మోరా ఫేమస్ స్వీట్ ను తనకు తెప్పించాలని కోరడంతో అతడు ఇప్పుడు దానిని తీసుకొచ్చి ప్రధానికి అందజేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 

లక్ష్య సేన్ మాట్లాడుతూ.. ‘నేను మోడీ గారి దగ్గరకి వెళ్లగానే నన్ను ఆయన అభినందించారు. చిన్న చిన్న విషయాలను అంతటి వ్యక్తి గుర్తుపెట్టుకోవడం నాకు ఆశ్చర్యమేసింది. అల్మోరాలోని ఫేమస్ స్వీట్ ‘బల్ మిఠాయి’ గురించి ఆయనకు తెలుసు.  అది  కావాలని గతంలో ఆయన నన్ను అడిగారు.అందుకే ఇప్పుడు నేను దానిని తెప్పించి ఆయనకు బహుమతిగా ఇచ్చాను... 

Latest Videos

undefined

అంతేగాక మోడీకి మా తండ్రి, తాత కూడా బ్యాడ్మింటన్ ఆడేవారని తెలుసు. ఇవన్నీ పైకి చూస్తే చాలా చిన్న విషయాలు. కానీ ప్రధాని స్థాయి వ్యక్తి వీటిని గుర్తుంచుకోవడం  అనేది మాములు విషయం కాదు. ఆయనతో మాట్లాడటం  చాలా బాగుంది...’ అని తెలిపాడు. 

 

What a touching story!

"PM Ji asked for Almora’s Bal Mithai & I got it for him. It is touching that he remembers small things about players”:

Must watch👇 pic.twitter.com/tPNpFZ5JQl

— Sunil Deodhar (@Sunil_Deodhar)

ఉత్తరాఖండ్ కు చెందిన లక్ష్య సేన్ అల్మోరా వాస్తవ్యుడు.  ఆ సిటీలో దొరికే వంటకాల్లో  బల్ మిఠాయి ఎంతో ప్రత్యేకం. ఉత్తరాఖండ్ లోనే గాక దేశవ్యాప్తంగా మిఠాయి షాపులలో ఇది లభ్యమవుతుంది. 

కాగా.. భారత బ్యాడ్మింటన్ జట్టుపై  మోడీ ప్రశంసలు కురిపించారు. ఇది సాధారణ విజయం కాదని, భారత జట్టు ‘అవును.. మేము  సాధిస్తాం..’ అనే వైఖరితో ముందుకెళ్లారని, ఈ విజయానికి వారు అర్హులని  ప్రశంసించారు.  ఇప్పుడు భారత్ కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్తుందని మోడీ తెలిపారు.  మన క్రీడాకారుల కోసం అవసరమైన సహాయ సహకారాలు అందివ్వడానికి  కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని  చెప్పారు. జాతి మొత్తం తరఫున  థామస్ కప్ విజేతలకు అభినందనలని అన్నారు. మోడీని కలిసిన వారిలో థామస్ కప్ విజేతలతో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, అసోం సీఎం హిమాంత్ విశ్వ శర్మ కూడా ఉన్నారు.

click me!