
GIPKL 2025 : గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ (GI-PKL) 2025 పురుషుల విభాగంలో మరాఠీ వల్చర్స్ విజేతగా నిలిచింది, గురుగ్రామ్ యూనివర్సిటీలో బుధవారం జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్లో తమిళ లయన్స్‌ను 40-30 తేడాతో ఓడించింది మరాఠా టీం. ఇలా మొదటి సీజన్లో మరాఠా టీం ఛాంపియన్‌గా అవతరించింది.
ఉత్కంఠభరితంగా సాగిన పోరులో తమిళ లయన్స్ చివరివరకు పోరాడింది. కానీ మరాఠా టీం అంతకంటే పట్టుదలతో ఆడి విజయం కైవసం చేసుకుంది. సునీల్, విశాల్, రాహుల్ అద్భుత ప్రదర్శనలతో 10 పాయింట్ల తేడాతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. సునీల్ మొత్తం 11 పాయింట్లతో ముందుండగా, విశాల్ 9 పాయింట్లు జోడించాడు, రాహుల్ డిఫెన్స్‌లో 6 కీలక టాకిల్ పాయింట్లతో తన ముద్ర వేశాడు.
సెమీఫైనల్లో భోజ్‌పురి లెపార్డ్స్‌పై 50-27 తేడాతో ఘన విజయం సాధించిన తమిళ లయన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే టైటిల్ రేసులో గట్టి పోరాటం చేసినా మరాాఠా వల్చర్స్ ను ఓడించలేకపోయింది. అదిత్య 10 రైడ్ పాయింట్లతో లయన్స్‌కు అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు, పర్వీన్ (5 పాయింట్లు), యశ్ (4 టాకిల్ పాయింట్లు) మద్దతు ఇచ్చినా తమిళ జట్టుకు ఓటమి తప్పలేదు.
మరాఠా వల్చర్స్ ఉత్కంఠభరిత సెమీఫైనల్ పోరులో పంజాబీ టైగర్స్‌ను 38-36 తేడాతో ఓడించి ఫైనల్లోకి చోటు దక్కించుకుంది. టైగర్స్ నుండి నాలుగు సూపర్ టాకిల్స్ ఉన్నప్పటికీ విజయం మాత్రం మరాఠాలదే అయ్యింది.
గ్రాండ్ ఫినాలేలో ఇరు జట్ల నుండి అద్భుతమైన ప్రదర్శనలు కనిపించాయి, కానీ కీలకమైన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, సకాలంలో దాడులు, దృఢమైన టాకిల్స్ అమలు చేసి GI-PKL ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లింది మరాఠా వల్చర్స్.
ఇదిలాఉంటే తొలి గ్లోబల్ ఇండియన్ ప్రవాసి కబడ్డీ లీగ్ (GI-PKL) మహిళల టైటిల్‌ను మాత్రం తమిళ లయన్స్ గెలుచుకుంది. తెలుగు చీతాస్‌ను 31-19 తేడాతో ఓడించి విజేతగా అవతరించింది.