Kush Maini: ఫార్ములా 2 రేసును గెలిచిన తొలి భారతీయుడిగా కుష్ మైని రికార్డు

Published : May 25, 2025, 05:11 PM IST
Kush Maini becomes first Indian to win Formula 2 Monaco race

సారాంశం

Kush Maini: ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మొనాకో స్ప్రింట్ రేసులో భారత రేసర్ కుష్ మైని చరిత్ర సృష్టించాడు. మొనాకోలో F2 రేసు గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

Kush Maini: ఫార్ములా 2 చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మొనాకో స్ప్రింట్ రేసులో భారత రేసర్ కుష్ మైని చరిత్ర సృష్టించాడు. మొనాకోలో F2 రేసు గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. బెంగళూరుకు చెందిన కుష్ మైని విజయం భారతదేశ ఫార్ములా 1 కలలకు ఊపిరిలూదింది.

DAMS లూకాస్ ఆయిల్ జట్టు తరపున పోటీ పడుతున్న 24 ఏళ్ల కుష్ మైని, శనివారం జరిగిన స్ప్రింట్ రేసులో పోల్ పొజిషన్ నుంచి ఆరంభించి, రేసు ముగిసే వరకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ లైట్స్-టు-ఫ్లాగ్ విజయాన్ని నమోదు చేశాడు. ఈ అద్భుత విజయం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మొనాకో ట్రాక్‌లో సాధించడం విశేషం.

 

 

ఈ విజయంపై కుష్ మైని మాట్లాడుతూ, “P1,  మొనాకోలో గెలిచిన తొలి భారతీయుడిని నేనే. ఇది గొప్ప గౌరవం, నిజంగా దీంతో ఒక కల నెరవేరినట్లే. DAMS జట్టుకు, నన్ను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు” అని అన్నాడు. భారత జాతీయ గీతం ప్లే అయినప్పుడు మైని గర్వంగా పాడిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ గెలుపుతో కుష్ మైనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

 

వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (X) పోస్ట్‌లో  "నువ్వు గొప్పగా ఉన్నావ్ కుష్ మైని, దేశం కూడా గర్విస్తుంది. మోంటే కార్లోలో F2 రేసు గెలిచిన తొలి భారతీయుడిగా కుష్ మైని చరిత్ర సృష్టించాడు. మహీంద్రా రేసింగ్ జట్టులో నిన్ను కలిగి ఉండటం మాకు గర్వకారణం" అని పేర్కొన్నాడు. JK రేసింగ్, TVS రేసింగ్ వంటి భారతీయ మోటార్‌స్పోర్ట్ సంస్థలు కూడా కుష్ మైని ఎదుగుదలకు తొలినాళ్ల నుంచి మద్దతు ఇస్తున్నాయి.

BWT ఆల్పైన్ F1 జట్టు రిజర్వ్ డ్రైవర్‌గా, మహీంద్రా రేసింగ్ ఫార్ములా E జట్టులో ఒక ఆటగాడిగా ఉన్న కుష్ మైని, తన అసాధారణ ప్రతిభను, సవాళ్లను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని ఈ విజయంతో నిరూపించుకున్నాడు. అతని ఈ విజయం భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్‌కు స్ఫూర్తినిస్తుంది.

ఒకప్పుడు ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌ను నిర్వహించిన భారతదేశం, అధిక ఖర్చులు, మౌలిక సదుపాయాల కొరత, నిర్వహణ సమస్యల కారణంగా ప్రపంచ మోటర్‌స్పోర్ట్‌లో ముందడుగు వేయలేకపోయింది. కానీ, కుష్ మైని మొనాకో విజయం భారతదేశంలో మోటర్‌స్పోర్ట్‌కు కొత్త ఆశను రేకెత్తించింది. ఈ విజయం తర్వాత కుష్ మైని రాబోయే ఆదివారం జరగనున్న ఫీచర్ రేస్, వచ్చే వారం బార్సిలోనాలో జరగనున్న పోటీకి మరింత జోష్ తో సిద్ధమవుతున్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !