
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు తన ఇంగ్లాండు పర్యటనలో శుభారంభం చేసింది. కుల్దీప్ యాదవ్ బంతితోనూ కెఎల్ రాహుల్ బ్యాట్ తోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి భారత్ ను తొలి ట్వంటీ20 మ్యాచులో విజయ తీరాలకు చేర్చారు.
కుల్దీప్ యాదవ్ కేవలం 17 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీయగా, కెఎల్ రాహుల్ పది ఫోర్లు, ఐదు సిక్సర్లతో చెలరేగి 54 బంతుల్లో 101 పరుగులు చేశాడు. దాంతో భారత్ ఇంగ్లాండుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్లు బట్లర్ (46 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69), జేసన్ రాయ్ (20 బంతుల్లో 5 ఫోర్లతో 30) శుభారంభం చేసినా కుల్దీప్ ధాటికి మిగతా బ్యాట్స్ మెన్ నిలదొక్కుకోలేకపోయారు.
ఏకంగా ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఐదు వికెట్లు తీసిన తొలి ఎడమచేతి చైనామన్ బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. ఉమేశ్‌కు రెండు వికెట్లు దక్కా యి.
ఆ తర్వాత లక్ష్యం ఛేదన బరిలోకి దిగిన భారత్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 163 పరుగులు చేసి నెగ్గింది. రోహిత్ (32) ఫర్వాలేదనిపించాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ శిఖర్ ధావన్ (5) వికెట్ కోల్పోయినప్పటికీ రాహుల్ చెలరేగి ఆడాడు.
రాహుల్ 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 13వ ఓవర్‌లో రోహిత్ పెవిలియన్ చేరడంతో రెండో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే 52 బంతుల్లో రాహుల్ తన కెరీర్ లో తొలి సెంచరీ చేయగా ఓ సిక్సర్‌తో కోహ్లీ మ్యాచ్‌ను ముగించాడు.