
120 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఒక్క ఒలింపిక్ పతకం తెచ్చేందుకు ముక్కీ, ములిగి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. భారతదేశంతో పోలిస్తే 1 శాతం జనం కూడా లేని దేశాలు, వందల్లో స్వర్ణ పతకాలు గెలుచుకుపోతుంటే... మనం ఒక్క కాంస్యం వస్తే చాలని సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఇవన్నీ చాలవన్నట్టుగా క్రీడల్లో రాణించాలనే ఆలోచనతో పట్టుదలతో ప్రయత్నిస్తున్న మహిళా అథ్లెట్లకు వేధింపులు తప్పడం లేదు...
భారత టాప్ మహిళా సైకిలిస్ట్, జాతీయ కోచ్ ఆర్‌కే శర్మపై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్‌కే శర్మ తనను తన గదికి బలవంతంగా లాక్కెళ్లాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మే 29న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కి ఫిర్యాదు చేసింది బాధితురాలు...
ఈ సంఘటనతో స్లోవేనియాలో ఉన్న భారత సైక్లింగ్ జట్టు సభ్యులందరినీ వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CFI). జాతీయ కోచ్‌పై ఫిర్యాదు చేసిన సైకిలిస్ట్ కూడా జూన్ 3న భారత్‌కి తిరిగి వచ్చింది. ఈ సంఘటనపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే సీఎఫ్‌ఐ కలిసి రెండు ప్యానెల్స్‌తో విచారణ నిర్వహిస్తున్నాయి...
‘అథ్లెట్ ఫిర్యాదుని స్వీకరించిన వెంటనే ఆమె భద్రత దృష్ట్యా, సైక్లింగ్ బృందాన్ని స్వదేశానికి రప్పించడం జరిగింది. కమిటీ ఈ విషయంపై పూర్తి విచారణ చేయనుంది. అతి త్వరలో నిజాలను నిగ్గు తేల్చి, బాధితురాలికి న్యాయం చేస్తాం...’ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మీడియాకి స్టేట్‌మెంట్ విడుదల చేశారు..
ప్రస్తుతం స్లోవేనియాలో భారత జట్టుకి మహిళా కోచ్‌లు ఎవ్వరూ అందుబాటులో లేరు. కోచ్‌పై ఫిర్యాదు చేసిన బాధితురాలు, టార్గెట్ ఒలింపిక్ పొడియం స్కీమ్‌లో సభ్యురాలిగా ఉంది. ఆమె ఒలింపిక్స్‌లో పతకం తెస్తుందనే నమ్మకంతో ప్రత్యేక్ష శిక్షణ ఏర్పాట్లు చేసింది ఒలింపిక్ అసోసియేషన్...
భారత సైక్లింగ్ టీమ్‌లో ఐదురుగు పురుషులు, ఓ మహిళా సైకిలిస్ట్ ఉన్నారు. వాస్తవానికి ఈ జట్టు స్లోవేనియాలో జరుగుతున్న సైక్లింగ్ పోటీల్లో పాల్గొని జూన్ 14న స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ టూర్‌ని మధ్యలోనే రద్దు చేసుకుని, వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ ఓంకార్ సింగ్...
అయితే లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సైక్లింగ్ జాతీయ కోచ్ ఆర్‌కే శర్మ మాత్రం ఇప్పటిదాకా స్వదేశానికి చేరుకోలేదు. త్వరలోనే అతన్ని స్లోవేనియా నుంచి స్వదేశానికి రప్పించి, నోటీసులు జారీ చేస్తామని తెలిపారు అధికారులు...
కొన్ని దశాబ్దాలుగా భారత సైకిలిస్టులు ఎవ్వరూ కూడా ఒలింపిక్స్‌కి కనీసం అర్హత కూడా సాధించలేకపోయారు. చివరిసారిగా 1964లో ఒలింపిక్స్‌లో సైకిలింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు భారత అథ్లెట్లు. అలాగే 1951లో జరిగిన ఆసియా గేమ్స్‌లో చివరిసారి భారత అథ్లెట్లు, సైకిలింగ్ ఈవెంట్‌లో పతకం సాధించగలిగారు. ఆ తర్వాత 71 ఏళ్లుగా భారత అథ్లెట్లు, సైకిలింగ్ ఈవెంట్లో చెప్పుకోదగ్గ పర్పామెన్స్ ఇచ్చింది లేదు...