వరల్డ్ నెం.1 ఇండోనేషియన్ జోడిపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయం సాధించిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి.. ఈ ఏడాది మూడో టైటిల్‌తో చరిత్ర..
భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడి సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టిస్తూ దూసుకుపోతున్నారు. మార్చిలో స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ జోడి... జూన్‌లో ఇండోనేషియా ఓపెన్ గెలిచింది. తాజాగా కొరియా ఓపెన్ 2023 టైటిల్‌తో హ్యాట్రిక్ సాధించారు సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి...
మెన్స్ డబుల్స్‌లో భారత జోడికి ఇదే మొట్టమొదటి కొరియా ఓపెన్ టైటిల్. ఇంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో 2017లో కొరియా ఓపెన్ టైటిల్ గెలిచింది పీవీ సింధు. కొరియా ఓపెన్ 2023 ఫైనల్‌లో వరల్డ్ నెం.1 ఇండోనేషియన్ జోడి ఫజర్ అల్‌ఫియన్- మహ్మద్ రియాన్ అర్డియంటోతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 17-21, 21-13, 21-14 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి...
undefined
మొదటి సెట్‌లో ఓడిన తర్వాత ఊహించిన విధంగా రెండో సెట్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది భారత పురుషుల డబుల్స్ జోడి. రెండో సెట్‌ని 4-2 తేడాతో ఆధిక్యం సాధించి ఆరంభించింది ఇండోనేషియన్ జోడి. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి చేసిన తప్పులను సరిగ్గా వాడుకున్న భారత జోడి, రెండో సెట్‌ని 21-13 తేడాతో కైవసం చేసుకుంది.
మూడో సెట్‌లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆది నుంచి ఆధిక్యాన్ని కొనసాగించింది భారత జోడి. 11-8 తేడాతో తొలి సగాన్ని ముగించిన భారత జోడి, రెండో సెట్‌ని 21-14 తేడాతో గెలిచి... కొరియా ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారత జోడిగా నిలిచింది..
సెమీ ఫైనల్‌లో వరల్డ్ నెం.2 జోడి చైనాకి చెందిన లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్‌లను 21-15, 24-22 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడి. ఇంతకుముందు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, మలేషియా ఓపెన్‌లో భారత జోడిపై విజయం సాధించిన లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్‌లపై అదిరిపోయే రివెంజ్ తీర్చుకోగలిగారు సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి..
ఈ ఏడాది మెన్స్ డబుల్స్‌లో మూడు సూపర్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడి.. ఏషియన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణం సాధించింది.
ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు థామస్ కప్, సయ్యద్ మోదీ సూపర్ 300, స్విస్ ఓపెన్ 300, థాయలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్స్ గెలిచారు.