
బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఆడిన ఆఖరి వన్డే టైగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రవర్తన తీవ్ర వివాదాస్పదం అవుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా మహిళా జట్టు 225 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో భారత మహిళా జట్టు 225 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
50 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో చేతిలో 5 వికెట్లు ఉన్నా... లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వచ్చినవాళ్లు వచ్చినట్టు భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అయ్యారు. అయితే అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్లే టీమిండియా ఓడిపోయిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరోపించింది..
నహీదా అక్తర్ బౌలింగ్‌లో ఫహిమా ఖటున్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైంది హర్మన్‌ప్రీత్ కౌర్. ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇచ్చాడని భావించిన హర్మన్‌ప్రీత్ కౌర్, తీవ్ర అసహనంతో వికెట్లను గిరాటేస్తూ పెవిలియన్‌కి వెళుతూ అంపైర్‌పై ఫ్రస్టేషన్ చూపించింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పినట్టుగా బ్యాటుకి అంచుకు తగిలిన బంతి, వెళ్లి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫహిమా చేతుల్లో పడింది. దీన్ని గమనించని హర్మన్‌ప్రీత్ కౌర్ కాస్త అతిగా ప్రవర్తించింది. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో కూడా చెత్త అంపైరింగ్ అంటూ ఆరోపణలు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్... అక్కడితితో ఆగలేదు..
మూడో వన్డే టైగా ముగియడంతో వన్డే ట్రోఫీతో ఇరు జట్లు ఫోటో సెషన్‌లో పాల్గొన్నాయి. ఈ సమయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానాని హర్మన్‌ప్రీత్ కౌర్ అవమానించేలా మాట్లాడిందని బంగ్లా టీమ్ ఆరోపిస్తోంది. ‘మీరేందుకు వచ్చారు? మీరు మ్యాచ్‌ని టై చేయలేదు. అంపైర్లే చేశారు. వాళ్లని పిలవండి. అంపైర్లతో ఫోటో దిగడమే కరెక్టుగా ఉంటుంది..’ అని నిగర్ సుల్తానాతో హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నట్టు సమాచారం..
ఈ వ్యాఖ్యలతో ఫీలైన ఫోటో సెషన్ నుంచి టీమ్‌తో సహా వాకౌట్ చేసింది. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇలా చేయలేదని చెబుతోంది..
‘హర్మన్‌ప్రీత్ కౌర్ అలా చేయదు. బంగ్లాదేశ్ కెప్టెన్‌తో ఆమె ఏమీ మాట్లాడలేదు కూడా. నేను విన్నంత వరకూ అంపైరింగ్ గురించి మాత్రం ఏదో మాట్లాడింది. బంగ్లాదేశ్ ప్లేయర్లను ఏమీ అనలేదు.. మ్యాచ్‌కి సంబంధం లేని విషయాలను మేం ఎందుకు మాట్లాడతాం..
మ్యాచ్ తర్వాత ఏం జరిగిందో అది కెమెరాల్లో రికార్డు కాదు. పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్ సమయంలో వాళ్లు ఎందుకు అలా చేశారో నాకు తెలీదు. దీని గురించి ఎక్కువ సాగదీయకపోవడమే మంచిది...’ అంటూ కామెంట్ చేశాడు స్మృతి మంధాన..
అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేలా కనిపించడం లేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దురుసు ప్రవర్తన గురించి బీసీసీఐకి, ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బంగ్లా బోర్డు నిర్ణయం తీసుకుందట.
అంపైర్లు ఒకటి లేదా రెండు తప్పుడు నిర్ణయాలు ఇచ్చినా కూడా ఆఖరి ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్ పరమ చెత్తగా సాగింది. ఆ విషయాన్ని హర్మన్‌ప్రీత్ కౌర్ ఎందుకు తెలుసుకోవడం లేదని వాపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.