వెస్టిండీస్ జిడ్డు బ్యాటింగ్... వికెట్ల కోసం టీమిండియా బౌలర్ల తిప్పలు..

Published : Jul 23, 2023, 12:24 AM IST
వెస్టిండీస్ జిడ్డు బ్యాటింగ్... వికెట్ల కోసం టీమిండియా బౌలర్ల తిప్పలు..

సారాంశం

మూడో రోజుటీ బ్రేక్ సమయానికి 86 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసిన వెస్టిండీస్... 75 పరుగులు చేసి అవుటైన క్రెగ్ బ్రాత్‌వైట్.. 

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ముప్పు తిప్పలు పెట్టిన భారత బౌలర్లు, రెండో టెస్టులో వికెట్ల కోసం తెగ కష్టపడుతున్నారు. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై ఓపిగ్గా ఆడుతూ భారత బౌలర్లను విసిగిస్తున్నారు విండీస్ బ్యాటర్లు... ఓవర్‌నైట్ స్కోర్ 86/1 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన వెస్టిండీస్, టీ బ్రేక్ సమయానికి 86 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 264 పరుగులు వెనకబడి ఉంది వెస్టిండీస్.. 

33 పరుగులు చేసిన చంద్రపాల్‌ని అవుట్ చేసిన రవీంద్ర జడేజా తొలి వికెట్ తీయగా, ముకేశ్ కుమార్‌కి రెండో వికెట్ దక్కింది. 57 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన కిర్క్ మెక్‌కెంజీ, ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

శార్దూల్ ఠాకూర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ముకేశ్ కుమార్‌కి ఇది మొట్టమొదటి అంతర్జాతీయ వికెట్ కూడా. ముకేశ్ కుమార్ వికెట్ తీయగానే వర్షం కురవడంతో మ్యాచ్‌కి కాసేపు అంతరాయం కలిగింది. వర్షం తగ్గిన తర్వాత ఆట తిరిగి ప్రారంభమైనా భారత బౌలర్లకు పిచ్ కూడా సరైన సహకారం లభించలేదు.

235 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేసిన వెస్టిండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్, అశ్విన్ వేసిన ఓ అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 157 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది వెస్టిండీస్. అయితే జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అతరనే కలిసి 80 బంతుల్లో 17 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. భారత బౌలర్లకు వికెట్ దక్కకుండా చేశారు. 

బ్లాక్ వుడ్ 89 బంతులు ఆడి ఒకే ఫోర్‌తో 16 పరుగులు చేయగా అలిక్ అతరనే 45 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేశారు. టీమిండియా స్కోరుకి వెస్టిండీస్ 264 పరుగులు వెనకబడి ఉన్నా, మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మూడో రోజు చివరి సెషన్‌ మొత్తం ఆలౌట్ కాకుండా వెస్టిండీస్ ఆడగలిగితే.. మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది..
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !