CWG 2022: చరిత్ర సృష్టించిన ‘ఆ నలుగురు’.. లాన్ బౌల్స్‌లో స్వర్ణం నెగ్గిన మహిళలు ఎవరంటే..

Published : Aug 03, 2022, 01:14 PM IST
CWG 2022: చరిత్ర సృష్టించిన ‘ఆ నలుగురు’.. లాన్ బౌల్స్‌లో స్వర్ణం నెగ్గిన మహిళలు ఎవరంటే..

సారాంశం

Lawn Bowls Gold Medal For India: భారత్ ఇంతవరకు  విశ్వక్రీడా వేదికలపై పతకం నెగ్గని ఆట లాన్ బౌల్స్. అసలు ఈ ఆటే మనకు కొత్త.  మరి ఈ ఆటను గెలిచిన ‘ఆ నలుగురు’ వనితల గురించి తెలుసుకుందాం.   

ఓ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ (పీఈటీ), ఓ  మహిళా పోలీసు, ఓ జిల్లా క్రీడా అధికారి,  ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌లు కలిసి కామన్వెల్త్ గేమ్స్-2022లో చరిత్ర సృష్టించారు. భారత్ కు అలవాటు లేని.. అసలు అదంటే ఏంటో అవగాహన లేని ఆటలో ఏకంగా స్వర్ణాన్ని సాధించి కొత్త చరిత్రను నెలకొల్పారు. చూడటానికి మనం గ్రామాల్లో ఆడుకునే గోటీల ఆటలా ఉందేంటి..? అనుకుంటున్నా ఈ ఆట ఆడటం కూడా అంత తేలికేమీ కాదు. పోనీ ఈ క్రీడలో పాల్గొన్నవారేమైనా యువ క్రీడాకారులా..? అంటే అదీ కాదు. భారత్ కు స్వర్ణం సాధించిన ‘ఆ నలుగురు’లో అందరికంటే తక్కువ వయసు ఉన్న మహిళ వయసు 33 ఏండ్లు. ఇంతకీ ఎవరా నలుగురు..? ఎక్కడ్నుంచి వచ్చారు..? ఆ వివరాలు మీకోసం. 

లాన్ బౌల్స్ ఆటలో స్వర్ణం సాధించిన నలుగురి పేరు లవ్లీ చౌబే, పింకి, నయన్‌మోనీ సాయికియా, రూపారాణి. ఈ బృందానికి లవ్లీ చౌబే సారథి. వీళ్ల నేపథ్యాల విషయానికొస్తే.. 

పోలీస్ ఆఫీసర్ చౌబే.. 

నలుగురి బృందంలో అత్యంత సీనియర్  లవ్లీ చౌబే. ఆమెకు 42 ఏండ్లు. స్వస్థలం జార్ఖండ్ లోని రాంచీ. వృత్తి పోలీస్. మధుకాంత్ పాఠక్ అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంది. ఆసియన్ ఛాంపియన్షిప్ లో  రజత పతక విజేతగా నిలిచింది. 

 

పీఈటీ పింకి.. 

స్వస్థలం ఢిల్లీ. పింకి వయసు కూడా 42 ఏండ్లు. దేశరాజధానిలోని  ఆర్కే పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్  పీఈటీగా పనిచేస్తున్నది. 2007 నుంచి ఈ ఆటలో ప్రావీణ్యముంది. కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ఆమెకు ఇది నాలుగోసారి పాల్గొనడం. పాటియాలాలోని  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో డిప్లమో పట్టా పొందిన  ఆమె.. ఇదే క్రీడలో ఆసియా ఛాంపియన్షిప్స్ లో  స్వర్ణ పతకం నెగ్గింది. 

జిల్లా క్రీడాధికారి రూపారాణి.. 

చౌబే మాదిరిగానే రూపారాణిది కూడా జార్ఖండే. ఆమె ప్రస్తుతం జార్ఖండ్ ల డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా పనిచేస్తోంది. రూపారాణికి ఇవి నాలుగో కామన్వెల్త్ పోటీలు. ఈ నలుగురు సభ్యులలో  రూపారాణి  మిగిలిన ముగ్గురిలో ఆత్మ స్థైర్యం నింపేదట. రూపారాణి వయసు 34 ఏండ్లు. 

 

రైతు బిడ్డ సైకియ.. 

అసోంలోని గోల్ఘట్ కు చెందిన ఓ సాధారణ రైతు బిడ్డ నయన్మోని సైకియ.  33 ఏండ్ల సైకియ లాన్ బౌల్స్ కంటే ముందు వెయిట్ లిఫ్టర్ గా స్పోర్ట్స్  కెరీర్ ఆరంభించింది. కానీ  గాయం కారణంగా ఆ ఆటకు దూరమైంది. పెద్దగా గాయాలు లేని ఈ ఆటను ఎంచుకుని సాధన చేసింది.  2011  నుంచి ఆమె అసోంలో ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నది. ఆసియన్ ఛాంపియన్షిప్స్ లో ఆమె ఇదివరకే రెండు స్వర్ణాలు గెలిచింది. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !