వర్షార్పణమైతే ‘శతకోట్లు’గోవిందా.. అందుకే..

By rajesh yFirst Published Jun 24, 2019, 3:56 PM IST
Highlights

ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లు వర్షార్పణమైతే క్లెయిమ్స్ కింద బీమా సంస్థలు రూ.100 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. కనుక టీమిండియా ఆడే మ్యాచ్‌లకు అడ్డు రావొద్దని వరుణ దేవుడ్ని బీమా సంస్థలు కూడా కోరుకుంటున్నాయి. 

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌ కప్‌ (ఐసీసీ)లో టీమిండియా మ్యాచ్‌లకు వర్షం ఆటకం కలిగించొద్దని క్రికెట్‌ ఫ్యాన్సే కాదు.. బీమా సంస్థలు.. భగవంతుడిని వేడుకుంటున్నాయి. వరల్డ్‌ కప్‌లో సెమీ ఫైనల్స్‌కు ముందు భారత జట్టు ఆడబోయే మ్యాచ్‌లు వర్షార్పణం కాకుండా ఉండాలని బీమా కంపెనీలు భావిస్తున్నాయి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్‌లు రద్దయితే బీమా సంస్థలు రూ.100 కోట్ల నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుంది.

సెమీ ఫైనల్స్‌కు ముందు భారత జట్టు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షార్పణం కావటంతో బీమా కంపెనీలు తలపట్టుకున్నాయి. మున్ముందు జరిగే మ్యాచ్‌లు వర్షార్పణమైతే రూ.100 కోట్లు చెల్లించక తప్పదని భావిస్తున్నాయి.

మ్యాచ్‌లు రద్దయితే ఐసీసీ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను దక్కించుకున్న బ్రాడ్‌కాస్టర్స్‌కు బీమా కంపెనీలు.. క్లెయిమ్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రపంచక్‌పలో నాలుగు మ్యాచ్‌లు వర్షం వల్ల నిలిచిపోయాయి.

ప్రపంచకప్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కు రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ప్రకటనల రెవెన్యూ వస్తుందని, దాని ఆధారంగానే సమ్‌ అష్యూర్డ్‌ ఉంటుందని బీమా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక మ్యాచ్‌లు అయిన సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ వంటి మ్యాచ్‌లకు అడ్వర్‌టైజ్‌మెంట్‌ రెవెన్యూ రూ.70-80 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 

రానున్న రోజుల్లో జరగబోయే కీలక మ్యాచ్‌ల విషయంలో బీమా కంపెనీలకు రిస్క్‌ లయబులిటీ గరిష్ఠంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్‌ హెడ్‌ సంజయ్‌ దత్తా అన్నారు. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే అండర్‌రైటర్స్‌ కింద భారీ మొత్తాలను బీమా కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అడ్వర్‌టైజ్‌మెంట్‌ రెవెన్యూకు దేశీయ బీమా కంపెనీలు కవరేజీని అందిస్తున్నాయి. 

మ్యాచ్‌లు వర్షార్పణమైతే తగ్గిన ప్రకటనల ఆదాయాన్ని అండర్‌రైటర్‌ ద్వారా బీమా సంస్థలు ఆ మొత్తాన్ని కవర్‌ చేస్తాయి. రెండు ప్రపంచ క్రికెట్‌ కప్స్‌, రెండు చాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు, టీ-20 వరల్డ్‌ కప్‌.. గ్లోబల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను స్టార్‌ ఇండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల పాటు ఉండే హక్కుల కోసం ఐసీసీకి స్టార్‌ ఇండియా 198 కోట్ల డాలర్లు చెల్లించింది.

ఈ నెల 16న భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు వర్షం ఆటంకమైన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో కీలకమైన ఈ మ్యాచ్‌ నిలిచిపోతే తమ పరిస్థితి ఏమిటని బీమా కంపెనీలు తలలు పట్టుకున్నాయి. అయితే మ్యాచ్‌ సజావుగా సాగటంతో ఊపిరి పీల్చుకున్నాయి. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై బీమా కవరేజీ రూ.50 కోట్లుగా ఉండటమే ఇందుకు కారణం. 

భారత మార్కెట్‌ సామర్థ్యం ఆధారంగా మొత్తం సమ్‌ అష్యూర్డ్‌ రూ.150 కోట్ల వరకు ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. బీమా దిగ్గజ సంస్థలైన న్యూ ఇండియా అష్యూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, ఐసీఐసీఐ లొంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు.. బీమా కవరేజీని ఇచ్చిన జాబితాలో ఉన్నాయి.
 

click me!