
హైదరాబాద్: ఒకప్పుడు భారతీయులు చదువుకోవడానికి రష్యాకు బారులుదీరేవారు. ఆ తర్వాత రూట్ మార్చారు. మళ్ళీ కొన్ని దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల పుణ్యమాని అలనాటి వాతావరణం కనిపిస్తోంది. టికెట్లు కొనడంలో భారతీయులు ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నారు.
కర్ణుడి చావుకు కోటి కారణాలు అన్నట్టుగా అగ్ర రాజ్యమైన అమెరికాతో పాటుగా మన దేశమూ వరల్డ్ కప్‌కు క్వాలిఫై కాకపోవడం కారణాలు ఎన్నో ఉన్నాయి. వాటి సంగతి పక్కనపెడితే.. ఇలా క్వాలిఫై కాని దేశాల్లో ఏ దేశం రష్యాలో మ్యాచ్‌లు చూడ్డానికి ఎక్కువ టికెట్లు కొనుగోలు చేసిందీ లెక్క తేల్చడానికి ఓ పేరొందిన మీడియా సంస్థ తాజాగా సర్వే చేసింది. అందులో ఇండియన్ ఫుట్ బాల్ ఫ్యాన్స్ మూడవ ప్లేస్‌లో ఉన్నారు. రష్యాకు పెద్ద ఎత్తున ప్రయాణం కట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
సర్వే ప్రకారం అంతర్జాతీయంగా అభిమానులకు 54 శాతం టికెట్లు కేటాయించారు. వాటిలో ఇండియన్ ఫ్యాన్స్‌కు 17,962 టికెట్లు కేటాయించారు. ఆ లెక్కన చూసినప్పుడు టికెట్ల కొనుగోలులో ఇండియా టాప్-20లో ఉంది. సేల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.
24 గంటల్లో 1900 టికెట్లు..!
ఫిఫా అధికారులు చెప్పినదాన్ని బట్టి గతేడాది టికెట్ సేల్స్ మొదలుపెట్టినప్పుడు కొనుగోలులో ఇండియా టాప్-10లో ఉంది. క్వాలిఫై కాని దేశాల్లో అమెరికా అత్యధిక టికెట్లు కొనుగోలు చేసింది. చైనా 39,884 టికెట్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న రష్యన్లు 8,72,578 టికెట్లు కొనుగోలు చేశారు.
ఫుట్‌బాల్ పట్ల భారతీయులకు అభిమానులకు ఉన్న మక్కువకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో లాస్ట్ మినిట్ టికెట్ సేల్స్ మొదలైన మొదటి 24 గంటల్లోనే మనోళ్ళు 1900 టికెట్లు కొనుగోలు చేశారు.
ఆటకు పెరుగుతున్న ఆదరణ
భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. మరీ ముఖ్యంగా ఇండియన్ సూపర్ లీగ్ ఆవిర్భవం తర్వాత, అంతర్జాతీయ వేదికపై నేషనల్ టీమ్ నిలకడగా రాణిస్తున్న కారణంగా ఈ గేమ్ పట్ల మనవారు ఇప్పుడిప్పుడే మక్కువ చూపడం మొదలుపెట్టారు.
ఫిఫా ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ 97వ స్థానంలో ఉంది. ఇది భారత్‌లో ఫుట్‌బాల్ క్లబ్‌ల నైతిక స్థైర్యాన్ని పెంచుతున్నది. ఇప్పుడు కాకపోయినా నాలుగేళ్ల తర్వాత వచ్చే మరో వరల్డ్ కప్‌కు క్వాలిఫై కాగలదన్న ఆశలు రేపుతున్నది.