
హైదరాబాద్: సంక్రాంతి పండగప్పుడు పందెం కోళ్ళ గురించి రకరకాల స్టోరీస్ వస్తుంటాయి. వాటికి జీడిపప్పు తినిపిస్తారని, మసాజ్ చేస్తారని, కన్న పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటారని. కానీ పందాల టైమ్‌లో మాత్రం గ్యాప్ లేకుండా బరిలోకి దింపుతారు వాటి యజమానులు. అయితే గెలుపు లేకుంటే చావు.. పందెం కోళ్ళ ముందు ఉన్న రెండే రెండు మార్గాలు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతున్న ప్రపంచంలో ప్లేయర్స్‌కు పందెం కోళ్ళ పెద్దగా తేడా లేకుండా పోతున్నది. వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో మొదలవుతుందన్నా సరే వేరే మ్యాచ్‌లలో తప్పనిసరిగా ఆడాల్సిన పరిస్థితిలో ప్లేయర్స్ ఉంటున్నారు. ఆ క్రమంలో శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అంతర్జాతీయ నిపుణుల మాటల్లో చెప్పాలంటే వారు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలంటే ఒక స్పెష్టలిస్టుల బృందం నిరంతరం ఆటగాళ్ళను కంటికి రెప్పలా కనిపెడుతుండాలి.
రెస్టుకు ఏది బెస్ట్ టైమ్?
ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి వరల్డ్ కప్ టోర్నమెంట్ వస్తుంటుంది. ప్రపంచంలో చాలా టీమ్స్ ఈ ఫుట్‌బాల్ వేడుక కోసం వేచి చూస్తుంటాయి. ఆటగాళ్ళకు అయితే అది టెన్షన్స్‌తో కూడుకున్న మెగా టెస్ట్. ఎలాగంటే.. ఈసారి వరల్డ్ కప్ విషయానికి వస్తే, అది జూన్ 14న రష్యాలో ప్రారంభం కావడానికి కేవలం మూడు వారాలకు ముందే యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ ముగిసింది.
కానీ లీగ్‌లో టీమ్స్ ఆర్గనైజర్స్ మాత్రం వరల్డ్ కప్ సంగతి తర్వాత ముందు దీంట్లో గెలుపు సాధించండి అన్నంతలా ప్లేయర్స్ మీద వత్తిడి తీసుకొచ్చారని 1990 వరల్డ్ కప్‌లో ఇంగ్లీష్ నేషనల్ టీమ్‌కు సాయపడిన అప్లయిడ్ స్పోర్ట్స్ ప్రొఫెసర్ జాన్ బ్రెవర్ అన్నారు. చివరి గేమ్ దాకా ప్లేయర్స్‌ను 100 శాతం వాడుకోవడమే పరమావధిగా క్లబ్‌లు పనిచేస్తున్నాయి. వరల్డ్ కప్ విషయం తర్వాత చూసుకుందాములే ధోరణితో ప్లేయర్స్‌ను టెన్షన్ పెడుతుంటారు అని బ్రెవర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సత్తా చెక్ చేయడానికి జీపీఎస్.. ప్లేయర్స్‌పై హైటెక్ నిఘా..!
ప్లేయర్స్‌ను ఎప్పటికప్పుడు ఫామ్‌లో తీసుకువస్తుండటం ట్రయినర్స్‌కు విషమ పరీక్ష అనే చెప్పాలి. వాళ్ళయినా ఎంత సేపని, ఎక్కడెక్కడని ప్లేయర్స్ వెంట పడతారు? ఈ విషయంలో టెక్నాలజీ ట్రయినర్స్ పాలిట వరమైంది. జీపీఎస్.. పూర్తిగా చెప్పాలంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. శాటిలైట్ సాయంతో నేల మీద చిన్న చీమ తలమీద వెంట్రుక కదలికలను సైతం మిల్లీ సెకన్లలో లెక్కకట్టి చెప్పే అద్భుతమైన సాధనం.
ట్రయినింగ్ సెషన్స్‌లో మ్యాచ్‌లలో ప్లేయర్స్ ప్రతి కదలికను, పరుగులో వస్తున్న మార్పులు, వేగంలో హెచ్చు, తగ్గులు, ఆఖరికి వారి గుండె కొట్టుకుంటున్న రేటును తెలుసుకోవడానికి సైతం ఈ జీపీఎస్‌ను వాడుతుంటారు.
మొదటి మ్యాచ్‌కు ముందు అడవుల్లో బైక్ రైడ్స్
ప్లేయర్స్ పక్కా ఫిట్‌నెస్ కోసం రెగ్యులర్ ఎక్సర్‌సైజులు మాత్రమే కాకుండా ఫన్నీగా ఉండే ఆటలు కూడా వారితో ఆడిస్తుంటారు. మొదటి మ్యాచ్‌కు ముందు, రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక వారం లేదా రెండు వారాల ముందు అడవుల్లో బైక్ రైడ్స్ లేకుంటే కొండలు, గుట్టలు ఎక్కడం లాంటివి చేయిస్తుంటారు. ఇదంతా కూడా మ్యాచ్‌లో గాయాలు తట్టుకునేలా ప్లేయర్స్‌ను సిద్ధం చేసే క్రతువులో ఓ భాగం మాత్రమే.
గాయాలు సర్వసాధారణం
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ వరల్డ్ కప్ పోటీల్లో ప్లేయర్స్ గాయపడ్డం సర్వసాధారణమైపోయింది. 2014 బ్రెజిల్ వరల్డ్ కప్‌లో ప్లేయర్స్‌కు 104 గాయాలు అయ్యాయి. అంటే సగటున ఒక మ్యాచ్‌కు 1.68 గాయాలు తగిలాయి.గాయాల్లో అత్యధికం కాళ్ళకు సంబంధించినవైతే, వాటిలో 18 శాతం తల లేదా మెడకు సంబంధించినవి. గాయాల్లో 10 శాతం చెయ్యి, భుజానికి చెందినవి.