ఫిఫా వరల్డ్ కప్ 2022: బెల్జియంకి షాక్ ఇచ్చిన మొరాకో... విధ్వంసం సృష్టించిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్...

By Chinthakindhi RamuFirst Published Nov 28, 2022, 11:01 AM IST
Highlights

FIFA World cup 2022: మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో ఓడిన బెల్జియం... ఓటమిని తట్టుకోలేక రోడ్లపై అల్లర్లు సృష్టించిన అభిమానులు... 

ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో మరో సంచలనం నమోదైంది. పెద్దగా అంచనాలు లేకుండా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీని ఆరంభించిన మొరాకో, టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటైన బెల్జియంకి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వరల్డ్ రెండో ర్యాంకులో ఉన్న బెల్జియం, మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో చిత్తుగా ఓడింది..

ఫస్టాఫ్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే ఆట 73వ నిమిషంలో మొరాకో ప్లేయర్ రొమెన్ సయిస్ గోల్ సాధించి 1-0 తేడాతో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత ఎక్స్‌ట్రా టైమ్‌లో 92వ నిమిషంలో గోల్ చేసిన జకారియా అమోక్‌లాల్ మొరాకో ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ఈ ఆధిక్యాన్ని నిలుపుకున్న మొరాకో, బెల్జియం జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది...

ప్రారంభంలో మొరాకోని తక్కువ అంచనా వేసి, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కనిపించిన బెల్జియం జట్టు... ప్రత్యర్థి డామినేటింగ్ ఆటకు తలొగ్గాల్సి వచ్చింది. టైటిల్ ఫెవరెట్‌గా ఖతర్‌లో అడుగుపెట్టిన బెల్జియం, ఇలా ఓడడం తట్టుకోలేకపోయిన ఆ దేశ అభిమానులు.. రోడ్ల పైకి వచ్చి విధ్వంసం సృష్టించారు...

ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో రోడ్ల పైకి వచ్చిన ఫుట్‌బాల్ అభిమానులు.. కార్లకు, ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అటుగా వచ్చిన వాహనాలను అడ్డుకుంటూ రాళ్ల దాడి చేసి, అద్దాలు పగులకొట్టడంతో రాజధాని నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి, దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

బెల్జియంలో ఆందోళన చేసిన వారిలో కొందరు మొరాకో జెండాలను పట్టుకొని నిప్పు పెట్టారు. ఈ అల్లర్లను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ ప్రాతికేయుడు తీవ్రంగా గాయపడ్డాడు. జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. 

ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం అందుకుంది బెల్జియం.  గ్రూప్ ఎఫ్‌లో రెండు మ్యాచుల్లో ఓ మ్యాచ్ గెలిచి, ఓ మ్యాచ్ ఓడిన  బెల్జియం మూడో స్థఆనంలో ఉంది. డిసెంబర్ 1 గురువారం తన తర్వాతి మ్యాచ్‌లో క్రొటారియాతో తలబడుతుంది బెల్జియం. కెనడాపై ఘన విజయం అందుకున్న క్రొటారియాపై గెలిస్తే బెల్జియం ప్రీక్వార్టర్ ఫైనల్ చేరుతుంది.. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో భారీ విజయం అందుకుంది క్రొటారియా... 

click me!