అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ

By pratap reddyFirst Published Dec 29, 2018, 8:40 AM IST
Highlights

రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో అడుగుపెట్టినందుకు సంతోషంగానే ఉన్నప్పటికీ అంబటి రాయుడు విషయంలో మాత్రం భయపడ్డానని ధోనీ అన్నాడు. 

చెన్నై:  హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడిని చూసి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భయపడ్డారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. 

రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో అడుగుపెట్టినందుకు సంతోషంగానే ఉన్నప్పటికీ అంబటి రాయుడు విషయంలో మాత్రం భయపడ్డానని ధోనీ అన్నాడు. ఇండియా సిమెంట్స్‌ ఉపాధ్యక్షుడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్‌ 50 ఏళ్ల క్రికెట్‌, వ్యాపార రంగాలకు సంబంధించి రాసిన ‘డిఫైయింగ్‌ ద పారడైమ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నాడు. 


సీజన్‌ ఆరంభానికి ముందు తనకు ఒక విషయంలోనే ఆందోళనగా ఉండేదని అంటూ రాయుడు, షేన్‌ వాట్సన్‌ ఇద్దరూ దూకుడు మనస్తత్వం కలిగిన వారని, వీరిద్దరే తనను ఓరకంగా భయపెట్టారని అన్నాడు. ముఖ్యంగా రాయుడు అయితే ఓ బంతిని వైడ్‌గానో లేక నోబాల్‌గానో భావించినపుడు అంపైర్‌ కనుక నిర్ణయం తీసుకోకుంటే, అతనే రెండు చేతులు చాపుతాడని ధోనీ వ్యాఖ్యానించాడు. 

ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి, మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, ద్రావిడ్‌, సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, గంభీర్‌, యువరాజ్‌, అంబటి రాయుడు సహా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు పాల్గొన్నారు.

click me!