కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను సంచలనం.. భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం

Published : Jul 26, 2026, 09:30 PM IST
Commonwealth Games

సారాంశం

Commonwealth Games: భారత్ వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను మరోసారి తన ప్రతిభను చాటుకుంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించింది.

స్నాచ్ విభాగంలో రికార్డు.. అద్భుతంగా పుంజుకున్న చాను

పోటీ ఆరంభంలో మీరాబాయి చానుకు స్వల్ప నిరాశ ఎదురైంది. తొలి ప్రయత్నంలో 82 కిలోల బరువును విజయవంతంగా ఎత్తలేకపోయినా, రెండో ప్రయత్నంలో అదే బరువును సునాయాసంగా లిఫ్ట్ చేసి తన స్థాయిని చాటుకుంది. అనంతరం చివరి ప్రయత్నంలో 85 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ స్నాచ్ విభాగంలో కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ప్రదర్శనతో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించి స్వర్ణానికి బలమైన పునాది వేసింది.

 

 

క్లీన్ అండ్ జెర్క్‌లోనూ తిరుగులేని ప్రదర్శన.. మొత్తం 190 కిలోల లిఫ్ట్

స్నాచ్‌లో ఆధిపత్యం చాటిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలోనూ అదే జోరు కొనసాగించింది. తొలి ప్రయత్నంలోనే 105 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి తన విజయాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 190 కిలోల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త కాంబినేషన్ రికార్డు నెలకొల్పింది. ఈ విభాగంలో నైజీరియాకు చెందిన రుత్ అసుక్వో 168 కిలోలతో రజత పతకం గెలుచుకోగా, మలేషియాకు చెందిన ఐరిన్ జేన్ హెన్రీ 167 కిలోలతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

హ్యాట్రిక్ స్వర్ణంతో మరో చరిత్ర.. భారత్ పతకాల వేటకు శుభారంభం

31 ఏళ్ల మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడోసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం. అంతకుముందు 2018 గోల్డ్ కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో కూడా ఆమె బంగారు పతకాలను గెలుచుకుంది. ఇప్పుడు గ్లాస్గోలోనూ అదే విజయ పరంపరను కొనసాగిస్తూ అరుదైన హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. ఈ విజయం భారత్‌కు కామన్వెల్త్ గేమ్స్-2026లో తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. అంతకుముందు పురుషుల 60 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రిషికాంత్ సింగ్ చనాంబమ్ రజత పతకం సాధించి భారత ఖాతాను తెరిచాడు. మీరాబాయి గోల్డ్‌తో భారత బృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఆమె సాధించిన ఈ ఘనత దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఆనందాన్ని నింపడమే కాకుండా, యువ వెయిట్‌లిఫ్టర్లకు స్ఫూర్తిగా నిలిచింది

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే