BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ సెమీస్‌కి రాంకీరెడ్డి- చిరాగ్‌శెట్టి... క్వార్టర్‌లో ఓడిన అర్జున్ - ధృవ్...

By Chinthakindhi Ramu  |  First Published Aug 26, 2022, 11:10 AM IST

వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో సెమీ ఫైనల్ చేరిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ... సెమీస్ చేరిన మొట్టమొదటి భారత మెన్స్ డబుల్స్ జోడీగా చరిత్ర... 


బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో మొట్టమొదటిసారిగా మెన్స్ డబుల్స్ జోడి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టి చరిత్ర క్రియేట్ చేసింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 స్వర్ణం నెగ్గి, అదే ఊపుతో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో బరిలో దిగిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, జపాన్‌కి చెందిన యోగొ కొబాయషి - టకురో హోకీలపై 24-22, 15-21, 21-14 తేడాతో సంచలన విజయం నమోదు చేశారు...

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో మొట్టమొదటిసారి సెమీ ఫైనల్ చేరిన భారత మెన్స్ డబుల్స్ జోడీగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి - చిరాగ్ శెట్టి... మరొక్క విజయం సాధిస్తే, ఫైనల్ చేరి భారత్‌కి పతకం ఖాయం చేస్తారు...

Latest Videos

undefined

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో భారత మెన్స్ డబుల్స్ జోడీ ఇంతవరకూ క్వార్టర్ ఫైనల్ స్టేజీ కూడా దాటింది లేదు. ఈసారి ఏకంగా రెండు భారత జోడీలు క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టాయి. సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టిలతో పాటు మొట్టమొదటిసారి క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించిన ఎంఆర్ అర్జున్ - ధృవ్ కపిల జోడీ పోరాటం ముగిసింది...

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 3 సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచి ‘ది డాడీస్’గా పేరొందిన ఇండోనేషియా జోడీ హెండ్రా సెటివన్- మహ్మద్ అహ్సన్‌తో 8- 21, 14- 21 తేడాతో ఓడింది ఎం.ఆర్. అర్జున్ - ధృవ్ కపిల జోడి.. భారత జోడిపై విజయం అందుకున్న డాడీస్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు... 

మెన్స్ సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాటం కూడా ముగిసింది. వరల్డ్ నెం 23 ఆటగాడు, చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ జావో జుంపెంగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 19-21, 21-6, 21-18 తేడాతో పోరాడి ఓడాడు హెచ్ ఎస్ ప్రణయ్...

తొలి సెట్‌లో చైనా ప్లేయర్‌ను ఓడించిన హెచ్‌ఎస్ ప్రణయ్, ఆ తర్వాత రెండు సెట్లలో జుంపెంగ్ జోరు ముందు నిలవలేకపోయాడు. ప్రణయ్ ఓటమితో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసినట్టైంది. వుమెన్స్ సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, రౌండ్  - 16 నుంచి నిష్కమించగా పురుషుల సింగిల్స్‌లో ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో మరో భారత ఆటగాడు లక్ష్యసేన్‌ని ఓడించి, క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించాడు హెచ్ ఎస్ ప్రణయ్...

మహిళల డబుల్స్‌లో, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీకి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇక బీడబ్లూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ఆశలన్నీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీపైనే ఉన్నాయి. 

click me!