
అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని ఓ బంగ్లాదేశీ క్రికెటర్ భార్య పోలీసులను ఆశ్రయించింది. కట్నం కోసం తనను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా తన భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు బాధితురాలు క్రికెటర్ ఆరోపణలు చేస్తోంది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమెదు చేశారు.
బంగ్లాదేశ్ క్రికెటర్ మొసద్దిక్ హుస్సేన్ సైకత్(22) వచ్చే నెల జరగనున్న ఆసియాకప్ కోసం బంగ్లా టీంలో సెలక్టయ్యాడు. అయితే ఈ సమయంలో అతడిపై భార్య లైంగిక వేధింపుల ఆరోపణ చేయడం చర్చనీయాంశంగా మారింది.
క్రికెటర్ మొసద్దిక్ కు తన సమీప బంధువు షర్మిలా సమీరా ఉషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇతడు చాలా రోజులుగా తన భార్యను వేధిస్తున్నట్లు బాధితురాలి తరపు న్యాయవాది కరీమ్ దులాల్ తెలిపారు. అదనపై కట్నం కోసం ఇతడు తన భార్యను ఇంట్లోంచి బైటికి గెంటేశాడని తెలిపారు. పుట్టింటి నుండి పదిలక్షల టాకాలు తీసుకురావాలని మొసద్దక్ భార్యను డిమాండ్ చేశాడని, అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో వేధింపులకు పాల్పడుతున్నట్లు లాయర్ తెలిపాడు.
అయితే ఈ విషయంపై మొసద్దక్ ఇంకా స్పందించలేడు. అయితే అతడి కుటుంబ సభ్యులు మాత్రం కావాలనే ఉష ఇలా తప్పుడు కేసులు పెడుతోందని, వరకట్న వేధింపుల ఆరోపణలు అవాస్తమని అంటున్నారు.