ఏషియన్ గేమ్స్ 2023: చెస్‌లో రెండు రజతాలు... ఆసియా క్రీడల్లో ఘనంగా ముగిసిన భారత్ క్రీడా ప్రస్థానం..

By Chinthakindhi RamuFirst Published Oct 7, 2023, 5:43 PM IST
Highlights

107 పతకాలతో ఏషియన్ గేమ్స్ 2023 పోటీలను ముగించిన భారత్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం.. ఆఖరి రోజు ముగింపు వేడుకల్లో పాల్గొని, స్వదేశానికి.. 

చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు ముగింపు దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భాగంగా రేపు ఆఖరి రోజున (అక్టోబర్ 8న) ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో కరాటే పోటీలు జరుగుతాయి. ఈ రెండు పోటీల్లో భారత అథ్లెట్లు ఎవ్వరూ పోటీలో లేకపోవడంతో ఏషియన్ గేమ్స్‌ 2023 పోటీల్లో భారత క్రీడా ప్రస్థానం నేటితో ముగియనుంది.

భారత మహిళా చెస్ టీమ్ హారికా ద్రోణవల్లి, కొనేరు హంపి, వంతిక అగర్వాల్, వైశాలి బాబు, సవితా శ్రీ, 15/18 పాయింట్లు సాధించి, రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచారు. పురుషుల చెస్ టీమ్ ఈవెంట్‌లోనూ రజతమే దక్కింది. ప్రజ్ఞానంద, గుకేశ్, విడిత్ గుజ్‌రాతీ, అర్జున్, హరికృష్ణ  రజతం గెలిచారు. ఈ రెండు పతకాలతో కలిపి భారత్ ఖాతాలో మొత్తం 107 పతకాలు చేరాయి.

అంతకుముందు రెజ్లింగ్‌లో 86 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన దీపిక్ పూనియా కూడా ఇరాన్ రెజ్లర్  హసన్ యజదానీచరతి చేతుల్లో 0-10 తేడాతో ఓడాడు. ఈ ఏషియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన ఏకైక భారత రెజ్లర్ దీపిక్ పూనియా..

ఈ రోజు భారత పురుషుల జట్టుతో పాటు భారత కబడ్డీ పురుషుల, మహిళల జట్టు స్వర్ణాలు గెలిచాయి. అలాగే బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆర్చరీలో జ్యోతి వెన్నం, ఓజాస్ డియోటెల్ స్వర్ణం గెలవగా అభిషేక్ వర్మ రజతం, అదితి స్వామి కాంస్య గెలిచింది. భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. 

ఈ రోజు గెలిచిన 12 పతకాలతో భారత్ పతకాల సంఖ్య 107కి చేరింది. భారత్ గెలిచిన 107 పతకాల్లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్‌గా పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన టీమిండియా, ఏషియన్ గేమ్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 100కి పైగా పతకాలు సాధించింది. 1962లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత్, ఆ తర్వాత బెస్ట్ పొజిషన్ కూడా ఇదే. ఆఖరి రోజు జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొనే భారత జట్టు, స్వదేశానికి తిరిగి రానుంది.

click me!