Russia Ukraine Crisis: రష్యాకు మరో ఎదురుదెబ్బ.. పుతిన్ ఆటలకు బలౌతున్న క్రీడాకారులు

By Srinivas M  |  First Published Mar 3, 2022, 6:25 PM IST

Winter Paralympics 2022: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై అనుసరిస్తున్న దుందుడుకు వైఖరి ఆ దేశపు క్రీడాకారుల కలలను కల్లలు చేస్తున్నది.  ప్రపంచంలో ఎక్కడికెళ్లినా వారికి నిషేధాలే స్వాగతం పలుకుతున్నాయి.


ఉక్రెయిన్ లో బాంబుల మోతతో విరుచుకుపడుతూ ఆ దేశాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న రష్యాపై యావత్ క్రీడా ప్రపంంచ కన్నెర్ర  చేస్తున్నది.  ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ఆధిపత్యపు ఆటలను ఇకనైనా ఆపాలని  డిమాండ్  చేస్తున్నది.  కానీ ఆయన మాత్రం దానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. దీంతో  పుతిన్ ఆటలు.. ఆ దేశపు క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి.  రష్యా అనుసరిస్తున్న వైఖరితో ఇప్పటికే ఆ దేశం నుంచి పలు క్రీడలు నిషేధానికి గురికాగా మరికొన్ని అక్కడ్నుంచి మరో దేశానికి తరలించబడ్డాయి. ఫిఫా,  యూఈఎఫ్ఏ రష్యాపై నిషేధం విధించగా.. ఇక ఇప్పుడు  రష్యా ఆటగాళ్ల మీద కూడా నిషేధాలు ప్రారంభమయ్యాయి.

బీజింగ్ లో మార్చి 4 నుంచి ప్రారంభం కాబోయే వింటర్ పారాలింపిక్స్  లో రష్యా ఆటగాళ్లను అనుమతించబోమని అంతర్జాతీయ  పారాలింపిక్ కమిటీ తెలిపింది. రష్యాతో పాటు  ఆ దేశానికి కొమ్ముకాస్తున్న బెలారస్ ఆటగాళ్లపై కూడా నిషేధం విధిస్తున్నట్టు పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ ఓ ప్రకటనలో తెలిపారు. 

Latest Videos

undefined

ఈ మేరకు పారాలింపిక్ కమిటీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో  ఇప్పటికే బీజింగ్ చేరుకుని  విశ్వ క్రీడల్లో తమ  దేశం తరఫున ఆడదామని భావించిన  పారా క్రీడాకారులంతా  నిరాశతో వెనుదిరుగుతున్నారు.  ఈ పోటీలలో రష్యా నుంచి 71  మంది, బెలారస్ నుంచి 12 మంది పారా అథ్లెట్లు పోటీలో ఉన్నారు. నిషేధం కారణంగా వీళ్లంతా స్వదేశాలకు పయనమయ్యారు.  

 

BREAKING: In a stunning reversal, Russian and Belarusian athletes have been banned from the Paralympics for their countries’ roles in the war in Ukraine. https://t.co/TJYeYMeKcm

— The Associated Press (@AP)

ఇదే విషయమై పార్సన్స్ స్పందిస్తూ.. రాజకీయాలతో క్రీడలకు ఎలాంటి సంబంధం లేదని, కానీ అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.  రష్యా, బెలారస్ అథ్లెట్లపై బహిష్కరణ వేటు తప్పలేదని చెప్పారు.  ఇలా జరగడం బాధాకరమని,  ఆయా దేశ ప్రభుత్వాల చర్యలకు  ఆటగాళ్లు బలయ్యారని తెలిపారు. 

ఇదిలాఉండగా.. ఇప్పటికే రష్యా లో జరుగబోయే అన్ని అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) నిషేధం విధించిన విషయం తెలిసిందే.  ఐవోసీ తో పాటు ఫిపా, యూఈఎఫ్ఏ కూడా రష్యా పై నిషేదాజ్ఞలు జారీ చేశాయి. ఈ ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌ నుంచి రష్యాపై ఫిఫా బహిష్కరణ వేటు వేసింది. ఫిఫా ప్రపంచకప్‌-2022తో పాటు  అన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి. ప్రపంచకప్ కు అర్హత సాధించేందుకు గాను  రష్యా.. ఈ నెల నుంచి ఖతార్ లో జరుగబోయే క్వాలిఫయింగ్ మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్రపంచ తైక్వాండో గౌరవ అధ్యక్షుడిగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఆ స్థానం నుంచి తొలగిస్తున్నట్టు  వరల్డ్ తైక్వాండో సమాఖ్య నిర్ణయించిన విషయం తెలిసిందే.  

click me!