ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటే ఏం జరుగుతుంది?

By telugu news teamFirst Published Jun 26, 2020, 9:44 AM IST
Highlights

ఆ సమయంలో గోరింటాకును తెంపడం వల్ల చెట్టుకి ఎంత మాత్రం హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే... జ్యేష్ఠ మాసంలో వానలు కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా ఎక్కువగా వర్షపు నీటిలో నానక తప్పదు. 

ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటించలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో నిగనిగలాడుతూ కనబడుతూ ఉంటుంది.

ఆ సమయంలో గోరింటాకును తెంపడం వల్ల చెట్టుకి ఎంత మాత్రం హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.
ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో ’కఫ’ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి.

గోరింటాకునకు ఒంట్లోని వేడిని తగ్గించే ఔషద గుణం కలిగి ఉంది. బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా శరీరానికి మేలు చేస్తుంది. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. 

ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని,పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసుబారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
 
ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే ! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెను వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.
 
ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కెమికల్ తో తయారుచేసిన 'కోన్ల' మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే 'లాసోన్‌' అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి. ఆరోగ్యానికి కాపాడుకోవాలి.


 

click me!