పాప పుణ్యాలు మనల్ని వెంటాడతాయా?

By telugu news teamFirst Published Jun 19, 2020, 12:19 PM IST
Highlights

మానవులలో బలం క్షీణించింది. సంపదలు తొలగి పోయాయి దరిద్రులు అయ్యారు. చేసిన కర్మలకు సత్ఫలితాలు రావడం తగ్గింది. రోగగ్రస్తులు అవడం మొదలైంది. మానవులకు దేవుని మీద నమ్మకం సన్నగిల్లి నాస్తికులు అయ్యారు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మహాభారతం ప్రశాంతంగా చదివినను లేక శ్రద్ధగా విన్నాను మనకున్న అనేక సంశయాలు తొలగిపోతాయి. మానవ జీవితలోని  పరమార్ధాలు అవగతమవుతాయి. ధర్మరాజుకు కలిగిన సందేహం కాల ధర్మాలు ఎలా ఉంటాయి అవి ఎలా మారుతూ వచ్చాయి. ఇక మానవుడు చేసే కర్మలకు పాప పుణ్య ఫలితాలు ఎలా ఉండబోతాయి అన్న ప్రశ్నకు మార్కండేయ మహర్షి ధర్మరాజుకు కలిగిన ధర్మ సందేహాలను ఈ విధంగా నివృత్తం చేసాడు.  

మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. " ధర్మజా! తొలుత ప్రధమ కల్పంలో అత్యంత నిర్మలమైన శరీరాలను సృష్టించాడు. ఆ ప్రకారం పుట్టిన మానవులు మహా సత్వగుణ సంపన్నులు, సత్యం పలికే వారు, సత్యవ్రతులై ఉన్నారు. జ్ఞాన సముపార్జన చేసారు, స్వేచ్ఛగా జీవించారు. దేవతల మార్గంలో పయనించారు. అధిక శ్రమ లేకుండా ఎక్కువ ఫలితాన్ని పొందారు. ధర్మం తప్పకుండా జీవించారు. వారికి మత్సరం వంటి దుర్గుణాలు లేవు. అధిక సంతానవంతులై వేల సంవత్సరాలు జీవించారు. కాల క్రమేణా వారిలో కామము, లోభము, మదము, మాత్సర్యము లాంటి దుర్గుణాలు ప్రవేశించాయి. అందుకే  దేవతలు వారిని వదిలి వేసారు. 

మానవులలో బలం క్షీణించింది. సంపదలు తొలగి పోయాయి దరిద్రులు అయ్యారు. చేసిన కర్మలకు సత్ఫలితాలు రావడం తగ్గింది. రోగగ్రస్తులు అవడం మొదలైంది. మానవులకు దేవుని మీద నమ్మకం సన్నగిల్లి నాస్తికులు అయ్యారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. పాపాలు చేస్తున్నారు. చివరకు నరకానికి పోతున్నారు. క్రిమి, కీటక, జంతు జన్మలు ఎత్తుతున్నారు. ఈ సంసారంలో తిరుగుతూ జనన మరణ చక్రంలో పడి సతమౌతున్నారు.

పాప పుణ్యా ఫలితాలు:- మానవులు చేసే పుణ్యం, పాపం మరణానంతరం కూడా నశించవు. వారి పాప పుణ్యములు నశించక వాటి వాసనలుగా వారి వెంట వెళతాయి. మానవులు ప్రస్తుత జన్మలో చేసిన పాప పుణ్యాలు అనేవి కొందరు వారు చేసిన పాప పుణ్యములకు ఈ జన్మలోనే ఫలితం అనుభవిస్తారు. పుణ్య పాప ఫలాలు ఖర్చు కాగ మిగిలిన ఫలితాలను కొందరు స్వర్గం లోనూ, నరకంలోనూ తప్పక అనుభవిస్తారు. కొందరికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం ఉండదు. కొందరు ఎక్కువ ధనం సంపాదిస్తారు. కాని మోహం లోభం కలిగి స్వ సుఖాలకు మాత్రమే ధనం ఉపయోగిస్తారు. 

ఇంద్రియ సుఖాలకు మాత్రమే వెచ్చిస్తారు. పుణ్యకార్యాలు చెయ్యరు. ధర్మజా! నీవు ఎక్కువ పుణ్యకార్యాలు చేసావు. వేదాధ్యయనం, తీర్ధయాత్రలు చెయ్యడం లాంటి పుణ్యకార్యాలనేకం చేసావు. ధర్మవర్తివి కనుక ఈ లోకంలో కష్టాలు అనుభవించినా పరలోక సుఖం లభిస్తుంది. ఎల్లవేళలా ధర్మకార్యాలు చేస్తూ, ధర్మాచరణచేసూ, ధర్మబద్ధంగా అర్జిస్తూ, ధర్మబద్ధంగా వివాహం చేసుకుని సంతానం పొందిన వారికి ఇహలోక, పరలోక సుఖాలను అనుభవిస్తారు. 

ఎల్లప్పుడూ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఇంద్రియ లోలులై తిరుగుతూ, శుచి శుభ్రం లేకుండా, నాస్తికులై అపరాధాలు చేసే వారు ఇహ లోకం లోనూ పర లోకం లోనూ దుఃఖం అనుభవిస్తారు. ధర్మజా ! మీరు దేవతాంశలతో జన్మించారు. మీరు ధర్మం తప్పకుండా జీవించి  శత్రువులను జయిస్తారు. భూభారాన్ని తగ్గిస్తారు. ఎన్నో యజ్ఞ యాగాదులు, దానధర్మాలు, పుణ్య కార్యాలు చేసి దేవత్వాన్ని పొందుతారు " అని మార్కండేయమహర్షి చెప్పాడు.

భావం:- మనిషిగా భూమిపై పుట్టిన వ్యక్తి తన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతూ కష్టాలు భరించలేక దేవుణ్ణి, ఐన వాళ్ళను నిందిస్తూ ఉంటారు. గత జన్మలోని బ్యాలెన్స్ పాప ఫలం ఈ జన్మలో అనుభవిస్తున్నఅని ఆలోచన చేయలేకపోతున్నారు మానవులు.  ఎవరైన అన్ని సుఖాలు అనుభవిస్తూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు అంటే గత జన్మలోని పుణ్య ఫలం ఖర్చు చేసుకుంటున్నాడు అని అర్దం. అందుకే  మానవులుగా జీవించిన మనం గత జన్మలో తెలిసో తెలియకో చేసిన పుణ్యమో, పాపమో  ప్రస్తుత జన్మలో దాని తాలూకు మిగులు ఫలితాలు అనుభవిస్తున్నాం అన్న దైవ రహస్యం అర్ధం అర్ధమైతే చాలు. 

ఎవరికైన మాట ఇచ్చి తప్ప కూడదు. ఒకరి కడుపు కొట్టి సంపాదించడం. ధర్మం తప్పి నడవడం. తలిదండ్రులను, గురువులను నిందించడం. భాద్యత విస్మరించి జీవించడం. దానధర్మం చేయకపోవడం. మితిమీరిన స్వార్ధంతో జీవించండం మొదలగు పనుల వలన మన ఖాతాలో పాప ఫలితం జమ అవుతుంది. అజ్ఞానాన్నివీడి భగవంతుని సృష్టిలో అందరం సమానం అన్న భావనకు రావాలి. మనకు కలిగే ఆకలి, సుఖ దుఃఖాలు అనే ఫీలింగ్ మనకు ఉన్నట్లు ఇతరులకు కూడా ఉంటాయని తెలుసుకోగలిగి నీ వలన ఇతరులకు కించిత్ హాని జరగకుండా జాగ్రత్త పడితే చాలు. మన ఖాతాలో ఉన్న పుణ్య ఫలం తగ్గకుండా ఎప్పటికప్పుడు సత్కార్యాలు చేస్తూ... పుణ్యఫలం పెంచుకుంటూ పొతే అంతా మంచే జరుగుతుంది. సూక్ష్మంలో మోక్షం, విజ్ఞతతో అర్ధం చేసుకుంటే ధన్యజీవులమౌతాం జై శ్రీమన్నారాయణ.   

click me!