సంకటాలను హరింపజేసే సంకటహర చతుర్థి

By telugu news teamFirst Published Jul 9, 2020, 11:03 AM IST
Highlights

సంకష్టహర చతుర్థి రోజున వ్రతమాచరించే వారికి సుభీష్టాలు చేకూరుతాయి. శనిదోషాలు తొలగిపోవాలంటే సంకట హర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే ఈతి బాధలుండవని ఆధ్యాత్మిక గురువులు వారి వారి ప్రవచనాలలో సూచిస్తూ ఉంటారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మనకున్న ఇబ్బందుల నివారణకొరకు విఘ్ననాయకుడైన వినాయకున్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో వ్రతాలున్నప్పటికీ.. సంకటాలను తీర్చే సంకటహర చతుర్థికి ప్రత్యేక విశిష్టత వుంది. అలాంటి సంకటహర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. సంకష్ట చతుర్థి రోజున వ్రతమాచరిస్తే సకల సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పౌర్ణమికి వచ్చే నాలుగో రోజు సంకట హర చతుర్థి రోజున ఉపవాసముంటే ఆయురారోగ్యాలు చేకూరుతాయి.

సంకష్టహర చతుర్థి రోజున వ్రతమాచరించే వారికి సుభీష్టాలు చేకూరుతాయి. శనిదోషాలు తొలగిపోవాలంటే సంకట హర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే ఈతి బాధలుండవని ఆధ్యాత్మిక గురువులు వారి వారి ప్రవచనాలలో సూచిస్తూ ఉంటారు. అందుకే ప్రతి నెలలో వచ్చే సంకట హర చతుర్థి రోజున వినాయకుడికి అభిషేకం చేయించి.. గరిక సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే 21 పత్రాలతో అర్చన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 9, 11, 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితినాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున  సుర్యోదయనికంటే ముందే నిద్రలేచి స్నానమాచరించి.. గణపతిని పూజించాలి. ఆరోజున సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవాలి. ఓ పసుపు వస్త్రంలో దోసెడు బియ్యం, రెండు వక్కలు, తమలపాకులు, రెండు ఖర్జూరాలు, రెండు అరటిపండ్లు ,దక్షిణ పెట్టి.. సంకల్పం చేసుకోవాలి.

ఆ మూటను మూటకట్టి.. గణపతి ముందుంచి ధూపం వెలిగించి కొబ్బరికాయ నైవేద్యం పెట్టి నివేదించాలి. సాయంత్రం పూట ఆ బియ్యంతో పొంగలి తయారు చేసుకుని స్వామి వారికి ప్రసాదం సమర్పించి తీసుకోవాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఇకపోతే.. జూలై తొమ్మిదో తేదీన సంకష్టహర చవితి వస్తోంది. ఆ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి.. ఉండ్రాళ్ళు, శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి.

సంకష్ట హర చతుర్థి రోజున గరిక పూజ:- విఘ్నేశ్వర స్వామికి గరిక అంటే ఎంతో ఇష్టం. అందుకే గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి. సంకట హర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే.. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. వినాయకుడికి గరిక ఆకుని నివేదించడం విశేషం. లేతగా ఉండే గరికపోచలు 3 అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడి అష్టోత్తర నామాలు చెబుతూ నివేదిస్తారు. కుడుములు, బెల్లం మొదలైన పదార్థాలను వినాయకుడికి ఇష్టంగా నివేదిస్తారు. అలాగే శనగలు, ఉండ్రాళ్ళను నివేదిస్తారు.

ఇంకా వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపం, దీపం నైవేద్యంగా సమర్పిస్తారు. మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు. శక్తి కొలదీ విగ్రహంలో గాని లేదా పటములో కానీ వినాయకుడిని పూజించవచ్చు. జిల్లేడు గణపతి దీనినే అర్క గణపతి అని కూడా పిలుస్తారు. ఈ మూర్తిని పూజించినా కోరుకున్న కోరికలు తొందరగా తీరడానికి ఒక సాధనమని మన పెద్దలు అంటుంటారు.

ఈ సంకటహర చతుర్థిని నాడు ఉపవసించడం ద్వారా అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. గణేశుడికి ప్రత్యేక ప్రార్థనలు చేసి, నువ్వులను, లడ్డూలను పేదవారికి లేదా గోమాతకు దానం చేయడం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కష్టకాలంలో గణేశుడి పూజ ద్వారా వాటిని తొలగిస్తుంది. ఆయనను నిష్టతో పూజించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం.

గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించి.. నువ్వులు, బెల్లం, లడ్డూలు, పువ్వులు, నీరు, ధూపం, గంధం, అరటి లేదా కొబ్బరికాయతో పూజించాలి. సంకట హర చతుర్థి రోజున గణపతికి నువ్వుల మోదకాలు సమర్పించాలి. చంద్రోదయానికి ముందే గణపతిని పూజించి.. సంకట హర వ్రత కథను పఠించాలి. ఇలా నియమ నిష్టలతో చేస్తే వారికి కష్టాలు కడతేరి అనుకున్న పనులు సకాలలో జరుగుతాయి. తప్పక గోమాత ప్రదక్షిణ, ఎదో ఒక దేవాలయ దర్శనం చేయాలి.

click me!