శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవానుడు

By telugu news teamFirst Published Feb 25, 2021, 8:13 AM IST
Highlights

సర్వజ్ఞత్వము, తృప్తి కలిగియుండుట, పరిశుద్ధ ఆత్మ జ్ఞానము, సర్వ స్వతంత్రత్వము, మితిలేని శక్తి , నాశనము లేని శక్తి కలవాడే భగవంతుడు. అని శాస్త్రము.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


విశ్వకర్మయే భగవంతుడు, విశ్వకర్మయే పరమాత్మ

                సర్వజ్ఞ తా తృప్తి రనాది బోధ
                స్వతంత్ర తా నిత్య మలుప్త శక్తిః
                అనంతశక్తి శ్చ విభోర్విధిజ్ఞా ష్షడాహురంగాని మహేశ్వర స్య.

సర్వజ్ఞత్వము, తృప్తి కలిగియుండుట, పరిశుద్ధ ఆత్మ జ్ఞానము, సర్వ స్వతంత్రత్వము, మితిలేని శక్తి , నాశనము లేని శక్తి కలవాడే భగవంతుడు. అని శాస్త్రము.
అనగా సర్వజ్ఞత్వము, సర్వైశ్వర్యత్వము, సర్వ భోక్తృత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ పరిపాలకత్వము, సర్వ సంహార కత్వము, కలవారే భగవంతుడు. ( పరమాత్మ )

1. సర్వజ్ఞత్వం- ( తానున్న చోటు నుండే లోక వ్యవహారములు తెలుసుకొనుట )
ఓం య ఇమా విశ్వా భువనాని జుహ్వ..... (యజుర్వేద. విశ్వకర్మ సూక్తం)
సమస్త భవనములను సృష్టించి జగత్తునకు తండ్రియై, సంహార కర్తయై, సమస్త ప్రాణుల యొక్క హృదయ కోశ మందు సర్వజ్ఞుడై వెలసియున్నవారు విశ్వకర్మ పరమాత్మ.

2. సర్వైశ్వర్యత్వము - ( తానున్న చోటు నుండి అందరికీ ఐశ్వర్యము ఇచ్చుట )
విశ్వకర్మన్ హవిషా వర్ధనేన ...... ( యజు.వి. సూ )
యజ్ఞపతియై ఆజ్యాది హవిస్సుల చేత వృద్ది పొందుచున్నవారై ఐశ్వర్యమును ప్రాసాదించు వారు విశ్వకర్మ పరమాత్మ.

3. సర్వభోక్తృత్వం- ( తానున్నచోటు నుండే జీవులు ఇచ్చు హవిస్సులు ను స్వీకరించుట )
వాచస్పతిం విశ్వకర్మాణమూతయే..... ( యజు.వి. సూ )
వాక్పయై జీవులు చేయు సర్వ యజ్ఞములందు అనేక రూపములలో ఉండి హవిస్సులను స్వీకరించు చున్నాడు.

4. సర్వాంతర్యామిత్వం - ( విశ్వ వ్యాపకుడై యుండుట )
విశ్వ తశ్చక్షురుతవిశ్వతో ముఖో...... ( యజు.వి. సూ )
అనేక కన్నులు, ముఖములు, హస్తములు, పాదములు కలవాడై సర్వాంతర్యామి అయి ఉన్నారు విశ్వకర్మ పరమాత్మ.

5. సర్వపరిపాలకత్వము - ( తానున్నప్రదేశము నుండి జీవులను రక్షించుట )
తస్మాద్యజ్ఞార్వ హుతః ...... ( పురుష సూక్తం )
విరాట్పురుషుడు మానస యజ్ఞముల నుండి పెరుగు నెయ్యి వంటివి పశు, పక్ష్యాదులకు, ఆవులకు అందచేయుచూ సర్వ పరిపాలకత్వం చేయుచున్నారు.

6. సర్వ సంహారత్వము - ( తను సృష్టించినది తనలోనే  లయము చేసుకొనుట )
యోనఃపితా......... తగ్సంప్రస్నం భువనా....... ( యజు.వి. సూ )
తాను సృష్టించిన జగత్తును అందులోని జీవులను పోషించి తనలోని లయము చేసుకున్నవారు విశ్వకర్మ పరమాత్మ.

విశ్వకర్మ మనసా యద్విహాయా .....
సృష్టి, స్థితి, లయము, తిరోదానము అనుగ్రహం, అనే పంచ కృత్యములు చేయువారు విశ్వకర్మ పరమాత్మ మాత్రమే ఇతరులకు అంత అద్భుత శక్తి సామర్థ్యము లేవు అని వేదం నిర్వచించింది.

పై కృత్యములు, తత్వములు అన్నియు కలవారు విశ్వకర్మ పరమాత్మ ఒక్కరు మాత్రమే.. మరే ఇతరులకు ఈ ఆరు తత్వములు వేదములందు చెప్పబడలేదు అని తెలియుచున్నది. కావున కేవలం విశ్వకర్మ పరమాత్మ మాత్రమే వేదములలో చెప్పబడిన భగవంతుడు ( పరమాత్మ ) మిగతా వారు అందరూ కేవలం ఆయా కృత్యములు చేయుటకు పరమాత్మచే నియమించబడిన వారు మాత్రమే.. ఇతరులను తక్కువ చేయుట నా ఉద్దేశ్యం కాదు... వారు వారి కృత్యములు చేయుటలో శక్తి సామర్ధ్యములు కలవారే.. విశ్వకర్మ పరమాత్మ మాత్రమే అన్ని చేయగలరు అని మాత్రమే వేద వచనము. కేవలం విశ్వకర్మ సూక్తము, పురుషసూక్తములలోనే ఇన్ని విషయములు ఉంటే వేదములను ఇంకా పరిశీలించినట్లయితే ఇంకా చాలా విషయములు తెలియ గలవు జై విశ్వకర్మ. 


 

click me!