తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతుంది. ఈ వేడుకల్లో ప్రధానంగా కొలిచే సమ్మక్క , సారలమ్మల చరిత్ర గురించి ఎన్నో కథలున్నాయి.
అక్కడ విగ్రహాలు ఉండవు, దేవతామూర్తుల ఆనవాళ్లు కనిపించవు,హోమాలు, యాగాల వేద మంత్రాలు వినిపించవు కానీ లక్షలాది భక్తుల కళ్ళు వన దేవతల చల్లని చూపుకోసం ఎదురు చూస్తుంటాయి. వారి దీవెనల కోసం వందల మైళ్ల నుంచి భక్త సందోహం తరలివస్తుంది. ఆ వనం జనారణ్యం అవుతుంది, ఆ కుగ్రామం మహా నగరాన్ని తలపిస్తుంది. ఇదంతా ఆదివాసీల మేడారం జాతర ముచ్చట. ప్రకృతినే దేవతలుగా పూజించే వేడుక మేడారం జాతర, అసియా ఖండంలో అతి పెద్దదైన ఈ గిరిజన జాతర రెండేళ్లకొకసారి మాఘ మాసంలో నాలుగు రోజుల పాటు జరుగుతుంది.
తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతుంది. ఈ వేడుకల్లో ప్రధానంగా కొలిచే సమ్మక్క , సారలమ్మల చరిత్ర గురించి ఎన్నో కథలున్నాయి. ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం ఓరుగల్లు రాజధానిగా కాకతీయ సామ్రాజ్యం వర్థిల్లిన కాలంలో గోదావరి తీరాన ఉన్న దట్టమైన అటవీ ప్రాంతానికి పగిడిద్ద రాజు, సమ్మక్క సామంతరాజులుగా ఉన్నారు. వారి సంతానం సారలమ్మ, జంపయ్య, గంటయ్య, మూగయ్య కరువు కాటకాల వల్ల కాకతీయులకు పగిడిద్ద రాజు కప్పం కట్టకపోవడంతో ప్రతాపరుద్రుడి సేనలు ఈ అటవీ రాజ్యం మీద విరుచుకుపడ్డాయి. ఆ యుద్ధంలో పగిడిద్ద రాజు, సారలమ్మ నేలకొరిగారు. గాయపడిన జంపన్న దగ్గరలోని సంపెంగ వాగులో పడిపోయాడు, సమ్మక్క చిలుకల గట్టుపైన నెమలినార చెట్టు దగ్గర వీరమరణం పొందింది.
undefined
ఆదివాసీలు చెప్పుకొనే మరో కథ ప్రకారం గిరిజనులకు అడవిలో పెద్దపులులు కాపలా కాస్తున్న ఒక చిన్నారి కనిపించింది. వాళ్ళు కళ్ళు మూసుకొని, కొండదేవరకు మొక్కుకున్నారట కళ్ళు తెరిచి సూసేసరికి పులులు మాయమైపోయాయట ఆ బిడ్డను కొండదేవర అవతారమని భావించి, ‘సమ్మక్క’ అనే పేరు పెట్టి, పెంచి పెద్ద చేశారట పాముకాటుకు గురైన వారిని బతికించడం, బిడ్డలు లేనివారికి సంతాన భాగ్యం కలిగించడం లాంటి మహిమలతో ఆమె ఆదివాసీల ఇలవేల్పుగా మారిందంటారు. అయితే ఈ కథలను ప్రస్తుత ఆదివాసీ పూజారులు ఖండిస్తున్నారు.
కాకతీయులకు తమకు సంబంధం లేదనీ, సమ్మక్క చరిత్ర ఛత్తీస్ గఢ్‌కు చెందినదనీ, సమ్మక్క- సారలమ్మల జాతర వందల ఏళ్ళ కాలక్రమంలో... ఛత్తీసఘడ్ నుంచి వివిధ ప్రాంతాల్లో సాగుతూ, మేడారంలో స్థిరపడిందనీ, అంతకుముందు బక్కయ్యపేటలో ఐలాపురంలో ఈ జాతర జరిగేదనీ ఛత్తీస్ఘడ్‌లో సమ్మక్కను ‘సడువలి’గా పిలుస్తారనీ వారు చెబుతున్నారు. ఇప్పటికీ పూర్తిగా ఆదివాసీ పద్ధతిలో సమ్మక్కకు మొక్కులు చెల్లించేది ఛత్తీసగఢ్‌కు చెందిన ఆదివాసీలేననీ గుర్తు చేస్తున్నారు... వారిద్దరూ తమ ఇలవేల్పులని పేర్కొంటున్నారు.
సమ్మక్క - పగిడిద్ద రాజు కళ్యాణంఈ జాతర సందర్భంగా సమ్మక్క - పగిడిద్ద రాజుల వివాహాన్ని ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. ఈ జాతర బుధవారం మొదలవుతుంది, జాతరకు ఒక రోజు ముందు... పగిడిద్ద రాజును అతని స్వస్థలమైన పూనుగొండ్లలో పెళ్ళికొడుకుని చేస్తారు. మర్నాడు ఆలయానికి చేరుకొని, బలి, ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆ తరువాత పగిడె రూపంలో కొత్త దుస్తులతో పగిడిద్ద రాజును సిద్ధం చేసి, మేడారానికి బయలుదేరుతారు...
మధ్యలో తాడ్వాయి మండలం లక్ష్మీపురంలోని పెనక వంశీయుల ఇంట్లో బసచేస్తారు. బుధవారం సాయంత్రానికి మేడారం చేరుకొని, తమ రాకను సమ్మక్క పూజారులకు తెలియజేస్తారు. జాతర రోజు ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
వడ్డెర కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు, పగిడిద్ద రాజుకు అహ్వానం పలుకుతారు, పగిడిద్ద రాజును, సమ్మక్కను ఎదురెదురుగా కూర్చోబెట్టి, పూజారులు వాయనం ఇచ్చి పుచ్చుకుంటారు. దీంతో వివాహం పూర్తవుతుంది, అనంతరం పగిడిద్ద రాజును సారలమ్మ గద్దెల దగ్గరకు తీసుకువెళ్తారు. మరునాడు గురువారం చిలుకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెల పైకి చేరుకుంటుంది. దీంతో మహా జాతర తుది ఘట్టానికి చేరుకుంటుంది. శుక్రవారం వన దేవతలందరూ గద్దెలకు చేరడంతో మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తారు. శనివారం సాయంత్రం సమ్మక్క వన ప్రవేశం చేయగా, పగిడిద్దరాజు, ఆయన సోదరుడు గోవిందరాజు, సారలమ్మ తమ స్వస్థలాలకు పయనమవుతారు, దీంతో జాతర ముగుస్తుంది.
ఈ నెల 16వ తేదీ (బుధవారం) నుంచి 19వ తేదీ (శనివారం) వరకూ ఈ వేడుకలు సాగుతాయి. ఈ కార్యక్రమాలన్నిటినీ గిరిజన పూజారులే నిర్వహిస్తారు, మేడారంలో సమ్మక్క గుడిమేడారానికి వచ్చే భక్తుల్లో చాలామంది గద్దెల దగ్గరే మొక్కులు చెల్లిస్తారు. అయితే సమ్మక్క ప్రధాన ఆలయం మేడారంలోనే ఉంది. అంతకుముందు. 1962 వరకూ ఈ ఆలయం బక్కయ్యపేటలో ఉండేది. రెండేళ్ళకోసారి అక్కడ జాతర జరిగేది. కరువు కారణంగా ఆ ఏడాది జాతరను మేడారంలో జరిపారు. సమ్మక్కకు అక్కడే ఆలయం నిర్మించారు. ఇక సారలమ్మ ప్రధాన ఆలయం మేడారానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి గ్రామంలోనూ సమ్మక్క భర్త పగిడిద్ద రాజు ఆలయం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో మేడారానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోఉన్నాయి.
ఇక పగిడిద్ద రాజు సోదరుడు గోవిందరాజులు ఆలయం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో మేడారానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాతర కోసం వారి ప్రతిరూపాలను ఆదివాసీలు కాలినడకన మేడారానికి తీసుకువస్తారు. 1889లో మత వ్యవహారాల పర్యవేక్షణ కోసం నాటి నిజాం ప్రభుత్వం ఒక శాఖను ఏర్పాటు చేసింది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే హిందూ దేవాలయాల పర్యవేక్షణ, మేడారం మహాజాతర జరిగేది. 1944 నుంచి ఈ జాతరకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగేవి. 1958లో రెవెన్యూ శాఖ, 1967లో దేవాదాయ శాఖ ఆ బాధ్యతలు చేపట్టాయి. 1996లో దీన్ని రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది, రవాణా సౌకర్యాలు పెరగడంతో ఇప్పుడు ఈ జాతరను సందర్శించే భక్తుల సంఖ్య దాదాపు కోటిన్నరకు చేరుకుంది.
డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151