పరశురామ జయంతి

By telugu news teamFirst Published Apr 25, 2020, 10:22 AM IST
Highlights

"జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలియజేస్తున్నాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


శ్రీ మహా విష్ణువు దశావతారాలలో ఆరవ అవతారమే శ్రీ పరశరామ అవతారం. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించాడని స్కంద పురాణం మరియు బ్రహ్మాండ పురాణం ద్వార మనకు తెలుస్తుంది.ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆవేశావతారంగా అగుపిస్తాడు. అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంత వరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగాలుగుతాడు. పరశురాముడు చిరంజీవుల్లో ఒకడిగా కుడా ప్రసిద్ధుడు. 

పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలియజేస్తున్నాయి.
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది.  త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జమదగ్ని అని కూడా అంటారు.

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్ర మంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళతాడు. 

సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని చెబుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో  జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని వేయి చేతులు పొంది మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. 

ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

కాలం ఇలా నడుస్తుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరం కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.

ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను  నాశనం చేస్తాడు. 

శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహా పరాక్రమవంతుడు.

click me!