వేణునాద విద్వాంసుడు తన కన్నా ప్రావీణ్యం గల మరొక వేణునాద విద్వాంసునిపై ఈర్ష్యను పెంచుకోవచ్చు. శ్రీకృష్ణుడు కూడా మురళీనాద విద్వాంసుడే కదా? కృష్ణునిపై అసూయను పెంచుకుంటాడా?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
ఈశ్వర వైభవం తెలిస్తే అహంకారం నశిస్తుంది. తెలియకపోతే, ఈశ్వరుడు మన ముందు నిలిచినా, మన అహంకారం మనల్ని బాగుపడనివ్వదు సరిగదా మరీ పాడుచేసి కూర్చుంటుంది. భస్మాసురుడు, రావణాసురుడు, దుర్యోధనుడు పరమాత్మను ముందు పెట్టుకొనే పాడయ్యారు. వస్తువు ఉంటే లాభం లేదు. వస్తుజ్ఞానం ఉండాలి.
మనలోని వైభవాలు కూడా ఈశ్వర వైభవాలే అని తెలియగనే అహంకారం క్షణంలో నశిస్తుంది. అంతేకాదు, ఈర్ష్యలు నశిస్తాయి. అసూయలు అదృశ్యమవుతాయి. శతృత్వాలు రూపు లేకుండా పోతాయి. కొందరు వృద్ధిలోకి వస్తే అది చూచి చాలా మంది ఈర్ష్యలు పెంచుకుంటారు. బాగా ఎత్తుకు ఎదిగిపోయాడని అసూయపడుతూ ఉంటారు. పైకిపోయే వాళ్లను చూచి ఈర్ష్యపడే బుద్ధి ఉన్నప్పుడు పైకి ఎగిరే పక్షిని చూచి ఈర్ష్యపడరు ఎందుకని? అదేమిటి? పక్షికి నాకు సామ్యమేమిటి? నిజమే. బావుంది. పక్షికి నీకు సామ్యము లేదు. మరి, పరమాత్మకు నీకు సామ్యముందా? చెప్పు. పరమేశ్వరునిపై నీవు ఈర్ష్యను పెంచుకోగలవా? అసూయపడగలవా?
వేణునాద విద్వాంసుడు తన కన్నా ప్రావీణ్యం గల మరొక వేణునాద విద్వాంసునిపై ఈర్ష్యను పెంచుకోవచ్చు. శ్రీకృష్ణుడు కూడా మురళీనాద విద్వాంసుడే కదా? కృష్ణునిపై అసూయను పెంచుకుంటాడా? వీణా విద్వాంసుడు వీణా విద్వాంసులైన మానవులపై అసూయను పెంచు కోవచ్చునేమో గాని సరస్వతి విషయంలో అసూయపడతాడా? నాట్యాచార్యులు నటరాజుపై ఈర్ష్య పెంచుకుంటారా? కవులు ఆదికవిపై అసూయపడతారా? బుద్ధిమంతులు బృహస్పతిపై పోటీపడతారా? అదేమిటి స్వామీజీ! అదంతా దైవబలం. ఈశ్వర వైభవం.
ఆ విషయంలో నాకు ఈర్ష్య ఎలా ఉంటుంది? అసూయ ఎలా వస్తుంది? అలాగా. అయితే విను. మానవులలో ఉన్నది కూడా పరమాత్మ వైభవమే. ఏ మానవుడూ తన వైభవంతో శోభించటం లేదు. అందరి వైభవాలూ అచ్యుతునివే. ఎవరిలో, ఎక్కడ, ఎప్పుడు ఏ వైభవం గోచరించినా అది అంతయూ పరమేశ్వరుని వైభవమే.
యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జిత మేవ వాI
తత్త దేవాన గచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్II
ఏయే వస్తువు ఐశ్వర్యవంతముగాను, కాంతియుతమైనది గాను, దృఢమైనది గాను, ఉన్నదో అలాంటిది నా తేజస్సు వలన కలిగినదిగా తెలుసుకో అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలిపాడు. కనుక ఎవరిలో వైభవం గోచరించినా అది ఈశ్వర వైభవమేనని గుర్తించాలి. దర్శించాలి. ఆనందించాలి. ఇదే జరిగితే, ఆకాశంలో చెట్లు ఉండనట్లు అంతఃకరణలో అసుర గుణాలు నిలువవు.
ఇతరులలోని వైభవాన్ని ఈశ్వర వైభవంగా దర్శించగనే ఈర్ష్యలు, అసూయలు అదృశ్యమగునట్లు, మనలోని వైభవాన్ని కూడా ఈశ్వర వైభవంగా దర్శించగలిగితే అహంకార దర్పాలు అదృశ్యమవుతాయి. మరి, నాలో ఏ వైభవం లేదు కదా! అని ఆలోచిస్తున్నావా? విచారించకు. మనలో ఏ వైభవం లేకపోయినా ఉన్నవారిలోని వైభవాన్ని గుర్తించగలిగినా అది వైభవమే. ఎవరిలో యశస్సు ఉండినా, దానిని నీవు గుర్తించగలిగావు అంటే నీలో ఆ జ్ఞానం ఉంది. గొప్పతనం ఉంది. యశస్సు ఉంది.గుర్తించటం చేతకాక గతంలో ఎన్నో పోగొట్టుకున్నాం. తెలియనివాడు రత్నాన్ని గాజుముక్క అనుకోవచ్చు. తెలియని దోషానికి జ్ఞానులకు కూడా దూరం అవుతూ ఉంటాం. దారిచూపే గురువులకు కూడా దూరమవుతూ ఉంటాము. పరులలోని పరమాత్మ వైభవాన్ని గుర్తించి దర్శించటం సులభమైన కార్యం కాదు. అది కూడా యశస్సే.
అలాంటి పవిత్రమైన యశస్సును ఇక్కడే మీరు చూడవచ్చు. ఇప్పుడే చూడ వచ్చు. జ్ఞానయజ్ఞం జరిగే స్థలం వేలాదిమంది శ్రోతలతో దర్శించటం సులభమైన కార్యం కాదు. అదికూడా యశస్సే. అక్కడ శ్రోతలు అందరూ విద్యావంతులే అని చెప్పగలమా? అందరూ మేధావులేనా? ఒక్కసారి ఆలో చించండి. అక్కడ నిరక్ష్యరాస్యులు కూడా కొందరు ఉన్నారు. అర్థం చేసుకో లేని ముసలివాళ్లు ఉన్నారు. ఏదీ అర్థం కాని పిల్లలు ఉన్నారు. అయినా, అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. ఎందుకని? వారిలో అక్షరజ్ఞానం లేకపోయినా అక్షయ స్వరూపుని గుర్తించే వైభవం వారిలో ఉంది. లేకపోతే వస్తారా? నిశ్శబ్దంగా వింటారా? వైభవాన్ని గుర్తించగలిగే వైభవమే ఒకనాడు వారిలో కూడా శోభిస్తుంది. ప్రయత్నశీలురు పతనమెరుగరు. అహంకారి ప్రగతి ఎరుగడు.