నెలరోజులూ చేసే పూజా ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి రోజు చేసే పూజకు ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. నెలరోజులూ చేసే పూజా ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి రోజు చేసే పూజకు ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
విశిష్టత:- కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెపుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా... మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే... కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.
శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలే......స్మిన్ సన్నిధింకురు.
ఈ రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, కేశవుల దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద, బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో ( కుండలు, లోహపాత్రలతో తయారుచేసి ) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రథము, అష్టశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగుంచే ఆనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది.
పురాణ కథ:- ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమే పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.
ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను ( మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను ) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
ప్రత్యేకంగా చేయవలసినవి:- దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, పేదలకు అన్న వస్త్ర దానం. దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి హారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.