గరుడపంచమి ప్రత్యేకత

By telugu news teamFirst Published Aug 13, 2021, 3:11 PM IST
Highlights

ఇక ఈ వ్రతం వెనుక మనకు ... తన తల్లి కోసం ప్రాణాలకు సైతం తెగించిన గరుత్మంతుడి కథ కనిపిస్తుంది. పూర్వం కశ్యప ప్రజాపతికి 'వినత - కద్రువ' అనే ఇద్దరు భార్యలు వుండేవారు. వినతకు పరాక్రమవంతుడైన వైనతేయుడు ( గరుత్మంతుడు) జన్మించగా, కద్రువకు పాములు జన్మించాయి. ఓసారి కావాలనే వినతతో కద్రువ పందెం కాసి, అన్యాయంగా ఆమెను గెలిచి తనకు దాసీగా నియమించుకుంది.

 

తిరుమ‌ల‌లో ఆగస్టు 13వ తేదీ శుక్రవారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు.

ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

స్త్రీలు కోరుకునే ప్రధమ వరం ... ప్రధాన వరం ... సంతానం. మంచి సంతానంతో కూడినటువంటి మాతృత్వాన్నే ప్రతి స్త్రీ ఆశిస్తుంటుంది ... ఆశపడుతుంటుంది. తమ పిల్లలు పరాక్రమవంతులై విజయాలు సాధించాలనే ప్రతి తల్లి కోరుకుంటుంది. అలాంటి స్త్రీలకు అవసరమైన ఉత్తమమైన వ్రతమే 'గరుడపంచమి వ్రతం'. అన్నదమ్ములున్న యువతులు మాత్రమే 'శ్రావణ శుక్ల పంచమి' తిథిలో ఈ వ్రతమును చేయవలసి వుంటుంది.

ఉదయాన్నే తల స్నానం చేసి కొత్త వస్త్రములు ధరించి పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై ముగ్గులు వేసి కొత్త వస్త్రమును వేసి బియ్యం పోయాలి. దానిపై గరుత్మంతుడి ప్రతిమను వుంచి షోడశోపచార పూజను నిర్వహించాలి. ధూప .. దీప ... నైవేద్య ... నీరాజనాలను సమర్పించాలి. చేతికి పది ముడులుగల తోరమును కట్టుకుని బ్రాహ్మణ సంతర్పణ చేయాలి. వారికి వాయనదానాలిచ్చి పంపిన తరువాత మాత్రమే ఆహారం తీసుకోవాలి.

ఇక ఈ వ్రతం వెనుక మనకు ... తన తల్లి కోసం ప్రాణాలకు సైతం తెగించిన గరుత్మంతుడి కథ కనిపిస్తుంది. పూర్వం కశ్యప ప్రజాపతికి 'వినత - కద్రువ' అనే ఇద్దరు భార్యలు వుండేవారు. వినతకు పరాక్రమవంతుడైన వైనతేయుడు ( గరుత్మంతుడు) జన్మించగా, కద్రువకు పాములు జన్మించాయి. ఓసారి కావాలనే వినతతో కద్రువ పందెం కాసి, అన్యాయంగా ఆమెను గెలిచి తనకు దాసీగా నియమించుకుంది.

దేవలోకం నుంచి అమృత భాండం తెచ్చి సవతి తల్లికి ఇస్తేనే తన తల్లికి దాస్య విముక్తి కలుగుతుందని తెలుసుకున్న గరుత్మంతుడు, వెంటనే అందుకు సిద్ధపడ్డాడు. దేవలోకం వెళ్లి ఇంద్రాది దేవతలను ఎదిరించి అమృత భాండం తెచ్చి తన సవతి తల్లి చేతిలో పెట్టాడు. అలా ఆయన తన తల్లికి దాస్య విముక్తిని కలిగించాడు.

తల్లి పట్ల అద్వితీయమైన ప్రేమానురాగాలను కనబరిచిన గరుత్మంతుడిని విష్ణుమూర్తి అభినందించి తన వాహనంగా చేసుకున్నాడు. గరుత్మంతుడు జన్మించిన ఈ శ్రావణ శుక్ల పంచమి రోజున ఆయనను ఆరాధించిన వారికి పరాక్రమవంతులైన బిడ్డలు కలుగుతారనీ, సకల శుభాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

 

click me!