మహా 'వైశాఖి' పూర్ణిమ

By telugu news teamFirst Published May 26, 2021, 1:36 PM IST
Highlights

ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.

వైశాఖ పూర్ణిమకు మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు. వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తీక మాసంలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర, వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. 

ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి.

చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు తెలియజేస్తున్నాయి. ఆశ్వీయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తీక పూర్ణిమ కృష్ణ పూజకి, అమ్మవారి ఆరాధనకి, శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. 

ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢ పూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయణ పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం తెలియజేస్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు. అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు.

click me!