ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి - సంశయ నివృత్తి

By telugu news team  |  First Published Nov 28, 2020, 2:33 PM IST

ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

undefined

                దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః 
                దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే 

ఈ సారి కార్తీక పౌర్ణమి తిధి 29వ తేదీ మధ్యాహ్నం 12.09 నిమిషాల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2 : 03 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం.... దీనిని మిగులు... తగులు... అని అంటారు. పెద్దగా కంగారు పడవలసిన పని లేదు... సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీపావళిని ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి. అదేవిధంగా పౌర్ణమి కూడా రాత్రి పూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే. 

ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం అందరికి తెలిసినదే ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా ఆదివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది. ఆ విధంగా పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం, సోమవారం ఉదయం 6:06 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది. మరుసటి రోజు అంటే సోమవారం రాత్రికి జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు. కృష్ణపక్షం కుడా వచ్చేస్తుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 29వ తేదీన ఆదివారం మాత్రమే జరుపుకోవాలి.

కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం మంగళకరం. లేకుంటే ఇంట్లో ఉన్న నీళ్ళతోనే స్నానం చేయాలి. దాన్నే గంగాస్నానంగా భావించాలి. నదిలో స్నానం చేసే అవకాశం లేకుంటే ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకుని గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి.
రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు భక్తులు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.

శివాలయాల్లో దీపాలు వెలిగించేవారు కొందరుంటే, ఆ అవకాశం లేనివారు ఇంట్లోనే తులసికోట ఎదుట దీపం వెలిగించొచ్చు. దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. ఇలాచేస్తే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని అంటారు. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి. తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారు.
 

click me!