Ganesh Chaturthi 2022: ఏ కార్యాన్ని మొదలుపెట్టినా.. ముందు పూజలందుకునేది గణ నాధుడు. అయితే వినాయక చవితి రోజున చంద్రున్ని చూడటం మంచిది కాదని పండితులు, జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే..
Ganesh Chaturthi 2022: మనుషులే కాదు.. దేవతలు సైతం ముందుగా గణ నాధుడినే పూజిస్తారట. ఎందుకో తెలుసా.. ఈ దేవుడిని పూజించడం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా మంచే జరుగుతుందన్న గట్టి నమ్మకం. హిందూ సంప్రదాయం ప్రకారం.. వినాయక చవితి పండుగను భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. ఇకపోతే ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31 వ తేదీనాడు వచ్చింది. అయితే ఈ వినాయక చవితినాడు చంద్రున్ని చూడకూడదని చెప్తారు. ఎందుకు చూడకూడదో.. దీనివెనకున్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
పురాణాల ప్రకారం.. కైలాసంలో శివుడి కోసం పార్వతి ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే శివుడు ఎంతకీ రాకపోయే సరికి స్నానానికి సిద్ధమవుతుంది. అయితే స్నానానికి వెళ్లే ముందు పార్వతీ మాత నలుగు పిండితో ఒక బొమ్మను తయారుచేసి ఇంటి ప్రధాన ద్వారం ముందు కాపలాగా పెడుతుంది. అయితే పార్వతి స్నానం చేసే టైంలోనే శివుడు వస్తాడు. కాపాలాగ ఉన్న గణపతి శివుడిని లోనికి పోకుండా అడ్డుకుంటాడు. దీంతో పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆ బొమ్మ తలను శూలంతో నరికేస్తాడు. ఆ సమయంలో బయటకొచ్చిన పార్వతీ మాత ఎంతో దుఖిస్తుంది. తను నా బిడ్డ.. నా బిడ్డను బతికించండని శివుడిని వేడుకుంటుంది. దాంతో మహాదేవుడు ఏనుగు తలను బొమ్మ మొండానికి అతికించి ప్రాణం పోస్తాడు. అలాగే గజాననుడు అని పేరుకూడా పెడతాడు.
దేవతలంతా గణేషుడిని ఆశీర్వదిస్తే.. ఒక్క చంద్రదేవుడు మాత్రం నవ్వుతాడు. ఎందుకంటే గణేషుడు ఏనుగు తలతో నడవడానికి ఇబ్బంది పడతాడు. దీనికి అవమానిస్తూ చంద్రుడు నవ్విన విషయం గణేషుడికి అర్థమైపోతుంది. నీ ఆకారాన్ని చూసుకుని గర్వపడుతున్నావనీ.. గణపతికి పట్టరాని కోపం వచ్చి నువ్వు ఎప్పటికీ చీకటిగానే ఉంటావని.. అలాగే భాద్రపద శుద్ద చవితినాడు చంద్రున్ని ఎవరైతే చూస్తారో.. వారు ఇతరులచే నిందలు పడతారని శాపం పెడతాడు. అయితే దేవతలందరూ గణేషుణ్ణి శాంత పరిచి శాపాన్ని వెనక్కి తీసుకోవాలని వేడుకుంటారు. చంద్రుడు కూడా తన తప్పును తెలుసుకుని క్షమాపనలు కోరుతాడు. అయితే అప్పుడు గణేషుడు నెలకు ఒకసారి మాత్రమే నీ పూర్తి ఆకారంలో కనిపిస్తావని శపిస్తాడు. దీనితో పాటుగా నా ఆరాధన సమయంలో చంద్రున్ని ఎవరైతే చూస్తారో వారు ఇతరులచే మాటలు, నిందులు పడతారని విఘ్నేషుడు అంటాడట. ఈ కారణంగానే చతుర్థి నాడు చంద్రున్ని చూడకూడని నమ్ముతారు.