Latest Videos

చంద్రబాబుకు షర్మిల రిక్వెస్ట్ ఏంటో తెలుసా??

By Galam Venkata RaoFirst Published Jun 12, 2024, 6:24 PM IST
Highlights

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులు చేయొద్దని విజ్నప్తి చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. 

‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారికి మనఃపూర్వక శుభాకాంక్షలు
చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాము.
ఈ సందర్భంగా, గడిచిన వారం రోజుల్లో, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండీ, అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు డా.వైఎస్ రాజశేఖర రెడ్డిగారి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయి. వారు చేశారని మీరు, మీరు చేశారని భవిష్యతులో మళ్లీ వాళ్లు ఇలా ఈ పగలకు, ప్రతీకారాలు అంతు ఉండదు. సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో వీటికి చోటు లేదు. ఉండకూడదు. ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో, ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు, శాంతిభద్రతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి, పేరుకు, అందివచ్చే అవకాశాలకు కూడా తీవ్రమైన విఘాతం కలగజేస్తాయని తెలియజేస్తున్నాము.
గడచిన ఐదేండ్లలో జరిగిన విశృంఖల పాలన, దాని వలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి ముందుకు తీసుకుని వెళతారని ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా నడుచుకుని, వైస్సార్ విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మీకున్న అనుభవముతో, మీరు పెద్దమనసు. నిస్పాక్షికత చూపుతూ, పరిస్థితులను చక్కదిద్దుతారని అనుకుంటున్నాము. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు, సంస్కారం, విచక్షణకు తావులేని చేష్టలతో మీ పేరుకు, ప్రతిష్టకు, పాలనకు మచ్చ రాకూడదని కోరుకుంటున్నాము. 
అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని తెలియజేసుంటున్నాను.
ఈ సందర్భంగా, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రజారంజకంగా సర్కారు పాలన సాగేలా చూడటంలో మీరు ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాం. 
నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఇతర మంత్రులందరికీ మా శుభాకాంక్షలు’’ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

కాగా, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున కడప లోక్ సభ స్థానానికి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. జగన్ కు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం వైసీపీ ఓటమికి దోహదం చేశారు. 

click me!