ఒక ఒరలో మూడు కత్తులు ఇముడుతాయా?

Published : Oct 19, 2016, 01:13 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఒక ఒరలో మూడు కత్తులు ఇముడుతాయా?

సారాంశం

ఒక ఒరలో మూడు కత్తులు ఇముడుతాయా రోడ్డున పడ్డ ఖమ్మం విభేదాలు సిఎం ముందుకు పంచాయితీ

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది సామెత. అంటే సమాన స్ధాయి కలిగిన ఏ ఇద్దరు ఒకే చోట ఇమడలేరని అర్ధం. ఈ విషయం గతంలో ఎన్నో మార్లు రుజువైంది కూడా. అటువంటిది మూడు కత్తులను ఒకే ఒరలో పెట్టాలని ప్రయత్నిస్తే ఎలాగుంటుంది? ఖమ్మం జిల్లా రాజకీయాల్లాగే ఉంటుంది.

అవునండి మూడు పార్టీల నుండి ముగ్గరు నేతలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీసుకువచ్చి తెలంగాణా రాష్ట్ర సమితిలో చేర్చకున్నారు. అసలే ఒకరంటే  మరొకరికి పడదు. దానికి తోడు ఇపుడు ముగ్గురూ ఒకే చోట అదికూడా అధికార పార్టీలో అయితే ఇంక చెప్పేదేముంది? ఎప్పుడూ వివాదాలు, పంచాయితీలే.

  ఒకరిని దెబ్బ కొట్టటానికి మరొకరు ప్రయత్నిస్తుండటంతో పార్టీ పరువు బజారున పడుతోంది. దాంతో రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడిన సంతోషండా కూడా నేతలు, కార్యకర్తలకు లేకుండా పోతోంది. ఫలితంగా ఖమ్మం పంచాయితీ ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు చేరిందని సమాచారం. తెలుగుదేశంలో ప్రముఖునిగా ఉన్న తుమ్మల నాగేశ్వర రావును కెసిఆర్ తొలుత పార్టీలో చేర్చుకున్నారు.

  అనంతరం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, గత ఎన్నికల్లో ఖమ్మంలో తుమ్మలపై గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ ను పార్టీలోకి లాక్కున్నారు. ఈ విషయంలో బాగా చొరవ చూపించింది కెసిఆర్ కుమారుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. కాబట్టి అజయ్ కు కెటిఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని వైసీపీ పార్టీ నుండి చేర్చకున్నారు.

  తుమ్మలను స్వయంగా కెసిఆర్ ఏరికోరి బలవంతంగా పార్టీలోకి రప్పించుకుంటే, మిగిలిన ఇద్దరిని కెటిఆర్ ఆకర్ష్ పథకంలో భాగంగా చేర్చకున్నారు. మూడు పార్టీల నుండి వచ్చిన ముగ్గురూ ఒకే పార్టీలో చేరటంతో వీరి మధ్య ఆధిపత్య పోరాటం మొదలైంది. ఈ పోరాటం మొదట్లో తెర వెనుక మాత్రమే ఉండేది. కాకపోతే ఇపుడు తెరముందుకు రావటంతో పార్టీలోని వివాదాలు రోడ్డుమీద పడ్డాయి.

తుమ్మలకు చెక్ పెట్టటానికి మొదట్లో ఎంఎల్ఏ, ఎంపి ఒకటయ్యారు. జిల్లా రాజకీయాల్లో బాగా సీనియర్, చాణుక్యునిగా పేరు పొందిన తుమ్మలను దెబ్బ కొట్టటానికి వీరిద్దరూ ఒకటవటంతో తుమ్మల జాగ్రత్త పడ్డారు. మంత్రైన తుమ్మల హవాను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆయనను ఇబ్బందులు పెట్టటం మొదలుపెట్టారు. అయితే, ఎంఎల్ఏ, ఎంపి అయిన అజయ్, శ్రీనివాస రెడ్డి ఇద్దరూ వ్యాపారస్తులు కూడా. అజయ్ కు మమతా మెడికల్ కళాశాల, శ్రీనివాసరెడ్డి పెద్ద కాంట్రాక్టర్.

   దాంతో వారి అవసరాల కోసమే వారిరువురూ పార్టీలు ఫిరాయించి టిఆర్ఎస్ లో చేరారన్నది బహిరంగ రహస్యం. అజయ్ ఆధీనంలో ఎప్పటి నుండో సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కోట్లాది రూపాయల విలువైన సదరు భూమిని సొంతం చేసుకునేందుకు అజయ్, అలాగే, పెండింగ్ లో ఉన్న కోట్లాది రూపాయల బిల్లులను అందుకునేందుకు శ్రీనివాసుల రెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.

   అయితే, హటాత్తుగా ఎవరూ ఊహించని రీతిలో ఇటు అజయ్, అటు శ్రీనివాసుల రెడ్డి వ్యవహారాలపై కోర్టులో కేసులు పడ్డాయి. ప్రభుత్వ స్ధలాన్ని అజయ్ కబ్జా చేసారంటూ ఒక కేసు, పనులు చేయకుండానే కోట్లాది  రూపాయల బిల్లులు పొందినట్లు శ్రీనివాసుల రెడ్డిపైన న్యాయస్ధానంలో కేసులు దాఖలైంది. పై ఇద్దరి వ్యవహారాలపై తుమ్మలే తన అనుచరునితో కేసులు వేయించారని బాగా ప్రచారం మొదలైంది.

దాంతో జిల్లాలో కలకలం మొదలైంది. పై ఇద్దరి వ్యవహారాలపైన కోర్టు సీరియస్ గా స్పందించి విచారణ మొదలు పెట్టటంతో పార్టీ పరువు బజారున పడటమే కాకుండా ముగ్గరి పంచాయితీ ఇపుడు కెసిఆర్ ముందుకు వచ్చింది. మూడు కత్తులను ఒకే ఒరలో పెట్టాలని కెసిఆర్ చేసిన ప్రయత్నాలతో చివరకు ఒరే పగిలిపోతుందేమోనని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. ల  

 

PREV
click me!