
ప్రధానమంత్రి నరేంద్రమోడితో ఇటు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, అటు ఎంపి కల్వకుంట్ల కవిత పోటీ పడుతున్నట్లు కనబడుతోంది. ఏ విషయంలో అంటారా? అదేనండి విదేశాల్లో పర్యటించటంలో. గడచిన రెండున్నర సంవత్సరాల్లో ప్రధాని దాదాపు 20 దేశాల్లో పర్యటించారు. మొత్తం అధికార పర్యటనలే అయినా ఇంత తక్కువ కాలంలో అన్ని దేశాల్లో పర్యటించటం రికార్డుగా ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయిలేండి.
మరి, ప్రధాని అదే పనిగా విదేశాల్లో పర్యటిస్తుంటే, అసలే విదేశీ మోజు బాగా ఎక్కువగా ఉన్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఊరకే ఉండరు కదా. పైగా రాజధాని అమరావతి నిర్మాణమనే ముసుగు ఎలాగూ ఉన్నది కూడా. దాంతో బాబుగారు కూడా విదేశాల్లో సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు.
ఇక, తెలంగాణ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి కుమార్తె, ఎంపి కల్వకుంట్ల కవిత విదేశీ ప్రయాణాల లోటును భర్తీ చేస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రికి బదులు కవితే విదేశాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తోంది. కవితకు బాగా అంది వచ్చిన అవకాశం ‘బతుకమ్మ’ పండుగ. కవితమ్మ కోసమే బతుకమ్మ పండుగ మొదలైందో లేక బతుకమ్మ లేకపోతే కవితమ్మ ఉండదో తెలీదు గానీ బతుకమ్మకు కవితమ్మ పర్యాయపదమై పోయింది.
దాంతో సదరు పండుగను విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశ్యంతో కవిత పది రోజుల్లో సుమారు 10 దేశాలు తిరిగేసారు. ఇక, పార్లమెంటరీ కమిటిల్లో మరో 20 దేశాల్లో పర్యటించి ఉంటారని సమాచారం. పై ముగ్గురు ఇప్పటికి రెండున్నర ఏళ్ళలో తిరిగిన విదేశాల సంఖ్య మాత్రమే ఇది. మరో రెండున్నర సంవత్సరాల్లో ఇంకెన్ని దేశాలు తిరుగుతారో కాలమే చెప్పాలి.