ఛీ ఛ్చీ.. చెత్త రాజకీయాలలో ఉండలేను...

Published : Oct 19, 2016, 08:17 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఛీ ఛ్చీ.. చెత్త రాజకీయాలలో ఉండలేను...

సారాంశం

రాజకీయాలను  తెగ రక్తి కట్టించిన జెసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెబితే  రాజకీయాలలో  కొంత శూన్యం  ఏర్పడుతున్నట్లే లెక్క. ఆయన జాగాని ఎవరో ఒకరు నింపేస్తారు. అదేమంత గొప్పవిషయం ?   ఆయన వారసుడో లేక  మరొకరి వారసుడో  ఎంపి అవుతారు. కాని, ఆయన సొంతమయిన రాయలసీమ మాట తీరు  మటుమాయమవుతుంది.    

 

సినిమాల్లో నటులు, రాజకీయాల్లో  నేతలు రిటైర్మెంట్ ప్రకటించరు.ఎంతకాలమయిన బండిలాగించాలనుకుంటుంటారు. అలా అనుకోకపోవడం అసహజం.  ఇలాంటి అసహజమయిన ప్రకటన చేశారు అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి. అనంతపురంలో తన చుట్టూ ఉన్న ’కుల’ రాజకీయాలతో  విసిగెత్తి పోయానంటున్నారు.  అనంతపురం పట్టణంలో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ’ ఇక ఈ రాజకీయాలొద్దుబాబు, నేనిక ఎన్నికలలో పోటీచేయను. అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటాను’ అనేశారు.

జెసి దగ్గిర నుంచి ఇలాంటి  ప్రకటన వస్తుందని ఎవరూ వూహించలేరు.  డెబ్బై ఒక్క సంవత్సరాల జెసి ( ఫిబ్రవరి 24, 1945) అంత పెద్దాయన లాగా కనిపించడు.సన్ గ్లాసెస్ తోనే ఎపుడూ కనిపించే జెసి చాలా చలాకయిన రాయలసీమ నాయకుడు.

 ప్రాంతం పేరుకు  తగ్గ దురుసుతనం, మాటల్లో సూదుల్లాంటి వ్యంగ్యం ఆయన సొత్తు. దురుసు తనం లేకుంటే అసలు పనులజరగవని జెసి బ్రదర్స్  ఈ మధ్య వాళ్ల వూరు తాడిపత్రి రూపు రేఖలు మార్చి నిరూపించారు.

జెసి బ్రదర్స్ ( దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి)  వి దురుసు రాజకీయాలనే వాళ్లు, ’అబ్బే పెద్ద ఫ్యాక్ష నిస్టులు సుమా’ అనే వాళ్లు ఆశ్యర్యపోయేలా , మన్ను మశానం పట్టి దుమ్ము డబ్బాలాగా ఉండే తాడిపత్రిని చాలా శుభ్రమయిన పట్టణంగా మార్చేశారు.

  ఈ కార్యక్రమానికి ఆయన సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్ల్యే జెపిప్రభాకర్ రెడ్డి నాయకత్వం వహించారు.  ప్రభాకర్ కు ముందు జెసి  చాలా కాలం తాడిపత్రికి నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించారు. రాష్ట్రంలో ఓటమెరుగని శాసన సభ్యలలలో ఆయన ఒకరు.  నియోజకవర్గాన్ని ’రిపబ్లిక్ ఆఫ్ తాడిపత్రి’ గా  పరిపాలించిన కుటుంబం వారిది. రెండు మూడు తరాలుగా తమ కుటుంటాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీని, తనను శాసన సభ్యుడిగా మంత్రిగా తయారు చేసిన తాడిపత్రిని  వదిలేసి 2014 లో అనంతపురం లోకసభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఏమంత గుర్తింపు రాలేదు. అదే విధంగా హిందీ లోక్ సభ కూడా  ఆయనకు పనికిరాకుండా పోయింది. అందుకే సభలో మాట్లాడాల్సిందంతా వదలేసి సభ గురించి బయట పెద్ద గా మాట్లాడుతూ ఉంటారు.  అనంతపురంలో మీటింగ్ లో లోక్ సభ మీద తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ “ ఏముందక్కడ? అవసరమయినపుడు చేతులెత్తడం తప్ప లోక్ సభలో చేసేదేమీ లేదు,” నిక్కచ్చిగా చెప్పేశాడు. అసెంబ్లీ మీడియాపాయింటే ఆయనకు లోక్ సభ.

ఫ్యాక్ష న్ రాజకీయాల మరాఠా కాబట్టి దేనికి జంక కుండా, ఎవరికి బెదరకుండా మాట్లాడటం ఆయన అలవాటు. పొగడుతున్నాడో, తెగుడుతున్నాడో అర్థం కాకుండా మాట్లాడి ముఖ్కమంత్రి చంద్రబాబు ముచ్చెమటలు పట్టించిన వాడు జెసి.

రాష్ట్రమంతా ప్రత్యేక హోదా అని గగ్గోలు పెడుతూంటే, ’ప్రత్యేక హోదా రాదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ... అంతా రాజీనామా చేసినా  ప్రత్యేక హోదా రాదు పొండి,’ అనేశారు.

అంతేకాదు, అర్థం కాకపోయినా,  ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం లాగా  విపరీతంగా పాపులర్ అయిన మాట ’ప్రత్యేక హోదా’  అని చాలా విలువయిన కామెంట్ చేశారు.

జెసికొక మాట తీరు వుంది. ఆయన మాటల్లో సున్నితమయిన మెరుపు, విరుపు, చురకలు వుంటాయి. పొగుడుతాడో, తెగుడుతాడో కూడా తేల్చుకోలేని కన్ఫ్యూజన్లో  పడేస్తారు. చంద్రబాబు నాయుడిని ఆయన  కర్మ జీవి అన్నారు. ’నీలం సంజీవరెడ్డి దగ్గిర నుంచి  ఇప్పటి దాకా , పివి తప్ప,  ముఖ్యమంత్రులందరిని నేనెరుగుదును. వారందరిలో మనవడితో కూడా  ఆడుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరే ’ అన్నారు.

 చంద్రబాబు అమరావతి విషయంలో కొద్ది ఎక్కువగానే మాట్లాడుతున్నారని  పబ్లీకున పచ్చి సత్యం అనగలిగిన నాయకుడాయన.

2014 తర్వాత  రెడ్ల పవర్ తగ్గిందని చెప్పకనే చెబుతూ ’శ్రీశైలం శాసన సభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేరికతో చంద్రబాబు నాయుడికి  కమ్మ బ్రాండ్ పోయిందని, ఇక రెడ్లంతా నాయుడికే  మద్దతునిస్తారు’ అనే సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 రోడ్ల విస్తరణతో పాటు, చెత్త లేని సిటిగా అనంతపురాన్ని మార్చాలనే తన లక్ష్యానికి  సంబంధించి స్థానిక తెలుగుదేశం శాసన సభ్యుడు ప్రభాకర చౌదరికి ఆయనకు చాలా రోజులుగా గొడవ నడుస్తున్నది. ఈ గొడవలో కులం దగ్గరి నుంచి స్థానిక పెత్తనం దాకా అన్ని రాజకీయాలున్నాయి. ఆయనే స్వయంగా ’ అనంతపురంలో కులగజ్జి రాజకీయాలు నడుస్తున్నాయి’అని  కూడా అన్నారు. తాడిపత్రిలా అనంతపురాన్ని మార్చేందుకు రాజకీయాలు అడ్డొస్తున్నాయని చెబుతున్నారు. ’ ఇపుడున్న రాజకీయాలు అభివద్ధికి అనుకూలంగా లేవు’ అని నిట్టూర్చారు.

ఇక ముందు ఎన్నికలలో పోటీ చేయనని చెబుతూనే అనంతపురం అభివృద్ధి కార్యక్రమాలలో  మాత్రం చురుకుగా పాల్గొంటానని హామీ ఇచ్చారు.

ఇలా రాజకీయాలను రసవత్తరం చేసిన జెసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెబితే  రాజకీయాలలో  కొంత శూన్యం  ఏర్పడుతున్నట్లే లెక్క. ఆయన జాగాని ఎవరో ఒకరు నింపేస్తారు. అదేమంత గొప్పవిషయం.  అనంతపురం నుంచి ఆయన వారసుడో లేక  మరొకరి వారసుడో  ఎంపి అవుతారు. కాని, ఆయన సొంతమయిన రాయలసీమ మాట తీరు, రాజకీయాట తీరు  మటుమాయమవుతుంది.

 

 

 

 

PREV
click me!