
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ తెరవెనుక ఎటువంటి రాజకీయం జరుగుతోందో ఎవరికీ అర్దం కావటం లేదు. హైదరాబాద్ లోని ఏపి సచివాలయంకు చెందిన నాలుగు బ్లాకులనూ తెలంగాణా ప్రభుత్వానికి ఇచ్చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునానయడు ఆధ్వర్యంలోని పొలిట్ బ్యూరోలో శుక్రవారం నిర్ణయించింది.
పదేళ్ళ పాటు ఏపి ప్రభుత్వానికి హక్కుగా సంక్రమించిన సచివాలయంను తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించాలనే నిర్ణయం మంత్రివర్గ సమావేశంలో కాకుండా పార్టీకి చెందిన పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించటం గమనార్హం.
ఏపి, తెలంగాణా రాష్ట్రాలకు పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఆ కారణంగానే సచివాలయంలోని ఎనిమిది బ్లాకులను రెండు ప్రభుత్వాలకు అప్పటి యూపిఏ ప్రభుత్వం చెరీ సగం బ్లాకులను కేటాయించింది. అయితే సాధారణ ఎన్నికల్లో ఏపిలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి.
ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే ఓటుకు నోటు ఘటన వెలుగు చూడటంతో తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ లో ఇబ్బందులు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో టిడిపికి చెందిన ఇద్దరు ఎంఎల్ఏలు మరికొందరు నేతలు పరోక్షంగాను పాత్రదారులవటంతో ఇరు ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గమంటున్నది. పైగా ఓకుటు నోటు కేసు తర్వాత వెలుగు చూసిన ఓ ఆడియో టేపులో వినబడిన గొంతుతో తెరవెనుక ప్రధాన సూత్రదారి చంద్రబాబునాయడుగా టిఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది.
సదరు ఘటన నేపధ్యంలో రెండు ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి కేసులు కూడా నమోదు చేసుకున్నాయి. దాంతో హైదరాబాద్ లో ఉండటం తనకు ఎంత మాత్రం క్షేమకరం కాదని అనుకున్న చంద్రబాబునాయడు వెంటనే విజయవాడకు తన మకాంను మార్చేసారు. అంతకుముందు ఎన్నో మార్లు పదేళ్ళ పాటు తమకు హైదరాబాద్ పై తెలంగాణాతో పాటు సమాన హక్కులున్నాయని వాదించిన చంద్రబాబు హఠాత్తుగా విజయవాడకు వెళ్ళిపోవటం పట్ల తెరవెనుక రాజకీయమే కారణమని ప్రచారం కూడా జరిగింది.
ఇరు ప్రభుత్వాల మధ్య అంటే ఇద్దరు సిఎంల మధ్య రాజీ కుడర్చటంలో భాగంగానే చంద్రబాబును హైదరాబాద్ ను వదిలి వెళ్ళాల్సిందిగా కెసిఆర్ షరతు విధించినట్లు కూడా బాగా ప్రచారం జరిగింది.
ఎవరేమనుకున్నా తాను హైదరాబాద్ నుండి వెళ్ళిపోవటమే కాకుండా సచివాలయం, హైదరాబాద్ లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను కూడా చంద్రబాబు బలవంతంగా తరలించుకు వెళ్ళారు. ఎప్పుడైతే చంద్రబాబు హైదరాబాద్ నుండి సచివాలయాన్ని విజయవాడకే తరలిస్తున్నారో అప్పటి నుండే ఏపి ఆధీనంలో ఉన్న నాలుగు బ్లాకులను కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలని కెసిఆర్ వ్యూహం మొదలు పెట్టారు.
వాస్తుశాస్త్రంపై అపార నమ్మకం ఉన్న కెసిఆర్ తనకు బాగా కలసి రావాలంటే మొత్తం సచివాలయం బ్లాకులను కూలగొట్టి కొత్తగా, వాస్తు ప్రకారం నిర్మించాలని అనుకున్నారు. అయితే తెలంగాణా ఆధీనంలోని బ్లాకులను కూల్చేందుకు నిర్ణయించిన కెసిఆర్ ఏపి ప్రభుత్వం ఆధీనంలోని బ్లాకుల విషయంలో ఏమి చేయలేకున్నారు. అందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సహకారాన్ని కెసిఆర్ కోరగా గవర్నర్ కూడా సహకరిచినట్లు ప్రచారం సాగుతోంది.
దానికితోడు శుక్రవారం ఉదయం గవర్నర్ విజయవాడకు వెళ్ళటం, అప్పుడు చంద్రబాబు, గవర్నర్ కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఏపి సచివాలయం ఆధీనంలో పదేళ్ళు ఉండాల్సిన నాలుగు బ్లాకులను తెలంగాణాకు ఇచ్చేయాలని నిర్ణయమైంది. దాంతో ఈ విషయంలో గవర్నరే ఇద్దరు సిఎంల మధ్య రాయబారం నడిపారనే ప్రచారానికి ఊతం లభించినట్లైంది.
పదేళ్ళ పాటు ఏపి ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన సచివాలయం నాలుగు బ్లాకులను చంద్రబాబు ఇపుడే తెలంగాణా ప్రభుత్వానికి ఎలా ఇచ్చేస్తారన్నది ప్రశ్న. అదే విధంగా సచివాలయం భవనాన్ని కెసాఆర్ తన వ్యక్తిగత నమ్మకాల మేరకు వాస్తు పేరుతో కూలగొట్టాలనుకుంటున్నారో ఎవరికీ అర్దం కావటంలేదు.
అసలు రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారితే వచ్చే ప్రభుత్వాలకు వీరు ఏమని సమాధానాలు చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాల స్దయిలో కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం నడుచుకునేట్లైతే ఇక విభజన చట్టాలెందుకని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.