ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పుడు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది. సీనియర్ మంత్రులు కొద్ది మందిని కొనసాగిస్తూ మిగతావారిని తప్పించనున్నట్లు చెబుతున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తానని ఆయన చెప్పారు. ఆ మేరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెజారిటీ మంత్రులను తొలగించి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రివర్గ పునర్య్యస్థీకరణ ఉంటుందని భావిస్తున్నారు.
సామాజిక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఐదు డిప్యూటీ సీఎంల పోస్టులను సృష్టించారు. అన్ని వర్గాలకు తన మంత్రివర్గంలో చోటు కల్చించాలనే ఉద్దేశంతో ఆయన ఆ పనిచేశారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు లేదు. అయితే, జగన్ తన మంత్రివర్గంలో ఆంజాద్ బాషాకు డిప్యూటీ సిెం పదవి ఇచ్చారు.
undefined
మంత్రుల పనితీరుపై జగన్ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కొద్ది మంత్రులు మాత్రమే సేఫ్ గా ఉన్నట్లు సమాచారం. మరో మూడు నెలల కాలంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని భావిస్తున్నారు.
మంత్రి పదవులకు రాజీనామా చేసి, ఎంపీలుగా వెళ్లిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పార్లమెంటుకు వెళ్లడంతో వారిద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానంలో మధ్యలో మంత్రి పదవులు చేపట్టిన సిహెచ్ వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులను కొనసాగించే అవకాశం ఉంది. వారితో పాటు సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, పి. అనిల్ కుమార్ యాదవ్, కురుసాల కన్నబాబు, కొడాలి శ్రీవెంకటేశ్వర రావు అలియాస కొడాలి నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్,, మేకపాటి సుచరిత, బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి పదవులకు ఢోకా లేదని సమాచారం.
రాజకీయంగా చురుగ్గా వ్యవహరించే ఎమ్మెల్యేలకు పునర్వ్యస్థీకరణలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని రాజకీయంగా ఎదుర్కునే సత్తా ఉన్నవారికి మంత్రివర్గంలో జగన్ స్థానం కల్పిస్తారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపిస్తారని భావించే వారికి స్థానం దక్కుతుందని భావిస్తున్నారు.
కాగా, ఆశావహుల జాబితా మాత్రం చాలా పెద్దగా ఉంది. టీటీడీ చైర్మన్ గా ఉన్న జగన్ బంధువులు వైవీ సుబ్బారెడ్డి మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే, ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మంత్రిపదవిని ఆశిస్తున్నారు.
అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, శిల్పా చక్రపాణి రెడ్డి, గ్రంథి శ్రీనివాస్ రావు, ఆనం రామనారాయణ రెడ్డి, తలారి వెంకట్ రావు, కళావతి, ఉషశ్రీ చరణ్, కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొర, కేపీ పార్థసారథి, జోగి రమేష్, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తదితరులు క్యాబినెట్ బెర్తులను ఆశిస్తున్నారు.