కేసీఆర్ లో తీవ్రమైన మార్పు: ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేత, ఇంకా...

By telugu teamFirst Published Jul 10, 2021, 11:25 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో అనూహ్యమైన మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాల్లో పర్యటిస్తూ అందరికీ అందుబాటులో ఉన్నాననే సంకేతాలను ఆయన ఇస్తున్నారు. 

ఇటీవలి కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావులో విశేషమైన మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ఎవరికీ అందుబాటులో ఉండరని, ఉంటే ఫామ్ హౌస్ లో లేదంటే ప్రగతిభవన్ లో ఉంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. ఈ స్థితిలో ఆయన వైఖరిలో తీవ్రమైన మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన తిరిగి ప్రజల్లోకి రావడం ప్రారంభించారు. 

కేసీఆర్ జిల్లా పర్యటలను ప్రారంభించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలోనే కాకుండా ప్రతిపక్షాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల నుంచే బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చురుగ్గా వ్యవహరిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఇక రేవంత్ రెడ్డి కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కాకుండా పార్టీకి ప్రాణం పోయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారనే విషయం కూడా అర్థమైంది. మరో వైపు వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఈ ముగ్గురు నేతలు కూడా తెలంగాణలో పాదయాత్రలు చేస్తామని చెబుతున్నారు.

ఆ నేపథ్యంలో కేసీఆర్ తన వైఖరిని మార్చుకుని అందరికీ అందుబాటులో ఉంటాననే సంకేతాలు ఇస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదని కేసీఆర్ కు తెలుసు. ఈటల రాజేందర్ ఇమేజ్ మాత్రమే కాకుండా ఆయనకు లభించే బిజెపి అండదండలు టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తాయనే విషయం కూడా ఆయనకు తెలుసు. దీంతో ఈటల రాజేందర్ తనపై చేసిన విమర్శలను తిప్పికొట్టడం కూడా కేసీఆర్ కు అవసరంగా మారింది. 

మరో చెప్పుకోదగ్గ మార్పు ఏమిటంటే, ప్రజా సంఘాలపై నిషేధాన్ని ఎత్తేయడం. నిజానికి, ఇంత సులభంగా ప్రజా సంఘాలపై ఆయన నిషేధం ఎత్తేస్తారన ఎవరూ ఊహించలేదు. విప్లవ రచయితల సంఘం (విరసం) వంటి ప్రజా సంఘాల మీద నిషేధం పెడితే ఎదురయ్యే నష్టం ఆయన అవగాహన ఉండే ఉంటుంది. ప్రజాస్వామిక వాతావరణం కూడా లేకుండా చేస్తున్నారని, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, నియంతలా పాలిస్తున్నారని ఆయన విమర్శలు వచ్చాయి. 

తాను అది కాదని చెప్పుకోవడానికి కేసీఆర్ ప్రజా సంఘాలపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు కనిపిస్తున్నారు. ఇది ఎవరూ ఊహించని విషయం. కేసీఆర్ ఏ మాత్రం వ్యతిరేకతను కూడా సహించరనే అభిప్రాయాన్ని తోసిపుచ్చడానికి అది కేసీఆర్ కు ఉపయోగపడుతుంది. మొత్తం మీద, కేసీఆర్ వైఖరిలో ఈ మార్పు ఎంత కాలం సాగుతుందనేది వేచి చూడాల్సిందే.

click me!