'విత్త' కష్టాలు: తెలియాల్సింది జగన్మోహన్ రెడ్డికే

By telugu team  |  First Published Jul 5, 2019, 10:53 AM IST

ఐదేళ్ళ క్రితం - ‘కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడు’ అనుకున్నరాష్ట్ర ప్రజలకు వారికి కూడా సరిపడినంత అనుభవం కలిగాక, ఇప్పుడు అనుభవం లేని నేతకు వాళ్ళు ప్రభుత్వాన్నిఏకపక్షంగా అప్పగించారు. 


జాన్ సన్ చోరగుడి 

విజేతలకు ‘విత్త’ కష్టాలు మొదలయ్యాయి. వాళ్ళిప్పుడు ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. అంటే దానర్ధం ఇల్లు బాగులేదనే కదా... మనకు ఇప్పుడు ఒక్కొక్కటీ తెలుస్తున్నాయి గాని, ప్రధానిగా మోడీ గత ఐదేళ్లుగా ఆఫీస్ లోనే వున్నారు కనుక, ఆయనకు ఎన్నికల ముందు కూడా లోపలి పరిస్థితి ఏమిటో తెలుసు. ఇప్పుడు అది కొత్తగా తెలియాల్సింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి మాత్రమే. ఆయన ఇప్పుడు ఆ తెలుసుకునే పనిలోనే ఉన్నారు. అందుకు తాజా ఉదాహరణ ఖరీఫ్ సీజన్ మొదలయ్యాక, విత్తనాలు కోసం రైతులు బయటకు వస్తే గాని అస్సలు విషయం బయటకు తెలియలేదు. ఏ.పి. సీడ్స్ కార్పోరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ.380 కోట్ల బాకీ వుందని. అలాగే, విజయవాడ-సింగపూర్ మధ్య వారానికి రెండుసార్లు తిరుగుతున్న ‘ఇండిగో’ విమాన సర్వీస్ జూన్ నెలతో ఆగిపోయింది. ఎందుకని ఆరా తీస్తే గాని విషయం బయటకు రాలేదు. ఆ సర్వీస్ వల్ల ఆ కంపెనీకి వస్తున్న నష్టాన్ని ‘వైబిలిటీ గ్యాప్ ఫండ్’ పేరుతో రాష్ట్రప్రభుత్వం నెలకు 3 కోట్లు నష్టపరిహారంగా చెల్లిస్తున్నదని! ఇటువంటి గతం వున్న పరిస్థితుల్లో జగన్ తన మొదటి బడ్జెట్ అసెంబ్లీ ముందు పెట్టబోతున్నారు.

Latest Videos

undefined

ఐదేళ్ళ క్రితం - ‘కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడు’ అనుకున్నరాష్ట్ర ప్రజలకు వారికి కూడా సరిపడినంత అనుభవం కలిగాక, ఇప్పుడు అనుభవం లేని నేతకు వాళ్ళు ప్రభుత్వాన్నిఏకపక్షంగా అప్పగించారు. అయితే, ఇక ముందు ప్రతిదానికి ప్రజలు మునుపటితో పోల్చుకుంటారు. జగన్ కూడా ‘నాన్న కంటే మేలైన పాలన...’ అంటున్నాడు. విమర్శ వస్తుంది అనుకున్న చోట అత్యంత అప్రమత్తంగా ఉంటున్నాడు. ప్రతి యాభై కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ అని ప్రకటించాక, అది మరొక తరహా ‘జన్మభూమి కమిటీ’ కాకూడదని, దాన్ని ప్రభుత్వ ఉద్యోగమని ‘డిఎస్సీ’ లకు వాటి ఎంపిక బాధ్యత అప్పగించాడు. ఇరుగు పొరుగు విషయంలో కూడా ముందునుంచి అప్రమత్తంగా ఉంటున్నాడు కనుక, ఆయన అనుకుంటున్నరీతిలోనే పాలన త్వరలోనే గాడిన పడవచ్చు. 

రాష్ట్రం మునుపటి కంటే వైశాల్యంలోను వయస్సులోనూ చిన్నది కావడం, మునుపటి ముఖ్యమంత్రి కంటే, ఇప్పటి ముఖ్యమంత్రి పాతికేళ్ళు పైగా చిన్నవాడు కావడం, ఈ రెండు కూడా నిజానికి ఇప్పుడు ఇది సమతూకం కుదిరిన సందర్భం. ఇక వివాదరహితుడుగా పేరున్నమాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం క్యాబినెట్ హోదాలో ప్రధాన సలహాదారుగా అండగా వున్నారు. జగన్ ఎంచుకున్న ‘ఆఫీస్ టీం’ లో ఉన్న యువత వారిలో సహజంగా వుండే సూక్ష్మగ్రాహ్యం, పట్టుదల ఇవన్నీ ఇప్పుడు అదనపు ప్రయోజనం కావచ్చు.  

ఎన్నిక అంటేనే ఇద్దరి మధ్య పోటీ కనుక, ప్రత్యర్ధులతో పోటీ తత్త్వం పాలనలో కూడా తప్పదు. జగన్ సాధించిన విజయం స్థాయిని బట్టి ఇప్పటిలో ఆయనకు పోటీదారులు లేకపోవడం అనేది ఒక అంశం అయితే, విజేత తనకు తానుగా పనిలో కొన్ని ప్రాధాన్యతలు వాటి అమలుకు కొన్ని ప్రమాణాలు (బెంచ్ మార్క్) నెలకొల్పి, వాటి సాధనలో మున్ముందు  ‘ఎరీనా’ లో ప్రత్యర్ధుల పోటీని ఎదుర్కోవడం మేలైన పద్దతి. ఎన్నికయిన ప్రభుత్వాల నాయకులు మొదటినుంచి తమ పౌర సమాజాలను నెమ్మదిగా అయినా వాస్తవిక దృష్టి వద్దకు తీసుకువెళ్ళడం మంచి పని. అప్పుడు ‘ఉన్నంతలో ఇంత కంటే మెరుగ్గా ఎవరు మాత్రం చేస్తారు’ అనేది ప్రజాభిప్రాయంలోనే క్రమంగా ఒక కొలమానం అవుతుంది. 

ఇటీవల ‘ఉచితం’ పట్ల దిగువ మధ్య తరగతిలో కూడా సమీక్ష మొదలవడం ఆసక్తికరమైన పరిణామం. జూన్ చివరివారంలో విజయవాడ మొగల్రాజపురం గుహలువద్ద సన్యాసి నాయుడు (50) అనే పండ్ల బండి వ్యాపారిని పలుకరించినప్పుడు, “ఐదు రూపాయలకు భోజనం పెట్టమని వీళ్ళను ఎవరు అడిగారు, రోడ్డ్లు మీద తిరిగే బేవార్స్ గాళ్ళను పెంచడానికి తప్ప. పిల్లల్నిబడికి పంపితే 15 వేలు ఇస్తామన్నారు, అది బాగుంది” అంటూ ఉచితం పట్ల తన అసహనాన్నిఆయన వ్యక్తం చేసారు. ఇటువంటి అభిప్రాయాన్నే రాజస్థాన్ నుండి వలస వచ్చి రెండు తరాలుగా ఇక్కడే ఉంటున్న విజయవాడ గవర్నర్ పేటలో జ్యుయలరీ షాపు యజమాని సుభాష్ అగర్వాల్ (67) వ్యక్తం చేసారు. “ప్రభుత్వం విద్య, వైద్యం ఇస్తే చాలుకదా, రూపాయికి కిలో బియ్యం ఎందుకు ఇవ్వాలి” అని ఆయన అంటున్నారు.    

నిజానికి ప్రభుత్వం నుంచి అందే సహాయం కోసం కనిపెట్టే వారి శాతం క్రమక్రమంగా తగ్గడానికి అవకాశం ఉండడం ఒక వాస్తవం. అయితే, దాన్నేతమ అధికార ఉనికికి కేంద్రంగా చేసుకుని రాజకీయ పార్టీలు ‘సంక్షేమ పాలన’ అందిస్తామని ఎన్నికల ప్రణాలికలు సిద్దం చేస్తున్నాయి. నిజానికి ఇదొక వైరుధ్యం. ఈ ఎన్నికల వాగ్దానాలు చేసేముందు కొందరు నాయకులు మాత్రమే ముందు నుంచి వాటి సాధ్యాసాధ్యాల ఎరుకతో ఉంటుంటే, మరి కొందరు ఎలాగెలా ముందు ‘తెప్ప’ దాటడం ముఖ్యం అనుకుంటున్నారు. ఈ వైరుధ్యాల మధ్య ఉండే వాస్తవికతను అంగీకరించడానికి, విజేతలకు ఇక్కట్లు తప్పడం లేదు. 

పూర్తిగా పూచీ నాదీ అన్నట్టుగా తన సారధ్యంలో జరిగిన 2009 ఎన్నికల ముందు, తన సంక్షేమ పధకాలకు 2007-2008 మధ్య ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తాకిడి తగలడం వై.ఎస్.ఆర్. కు తెలుసు. అందుకే ఎన్నికల్లో ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో మిత్రవైరుధ్యానికి సిద్దమయ్యారు. అప్పటి అసెంబ్లీ-పార్లమెంట్ విజయం తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ, ‘మంచి గెలుపు కాదు, ఫస్ట్ క్లాస్ రాలేదు - పాస్ చాలదు’ అని వై.ఎస్. అన్నది ఈ దృష్టితోనే. అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీ అయినా ‘చివరి లబ్దిదారుడు’ వరకు, అనడం వినడానికి ఎంతో గొప్పగా ద్వనిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో  ఎంపిక వద్దకు వచ్చేసరికి సమస్యలు ఎప్పటి మాదిరిగానే ఉంటున్నాయి. పార్టీ అదే అయినా రాజశేఖర రెడ్డి తర్వాత విద్యార్ధుల ‘ఫీజ్ రీయంబర్స్ మెంట్’ పధకం క్రమంగా మసకబారడం మనకు తెలిసిందే.  
         
వయస్సు చిన్నదే కనుక దాటి వచ్చిన అనుభవాల నుంచి, రాష్ట్ర పరిస్థితిని ఒక  గాడిన పెట్టడం ముఖ్యమంత్రిగా జగన్ కు కష్టం కాకపోవచ్చు. నేతల పాత్రలు తారుమారు అయ్యాయి కనుక, క్రమంగా ఇప్పుడిక గత ప్రభుత్వంలో జరిగిన పనులకు సంబంధించిన తెరలు తొలగాల్సివుంది. అవన్నీ ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ వై. జగన్మోహన రెడ్డి ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేసి ఘనవిజయం స్వంతం చేసుకున్నారు కనుక, ఇప్పటికే అమలులో ఉన్నవాటిని కొనసాగిస్తూనే, దశలవారీగా కొత్త వాటిని నెరవేర్చడానికి ఉన్న వనరుల లభ్యత గురించి వెతుకులాడాలి. 

ఇందుకోసం ‘అబ్కారీ’ ఆదాయం పోగొట్టుకోవడానికి ప్రభుత్వం సిద్దపడటం మేలైన ఆలోచన. రాజకీయ, ఆర్ధికంతో పాటుగా సామాజిక దృష్టి కూడా వున్న నాయకులకే ఇటువంటి ఆలోచన చొరవ వుంటుంది. ఒక పౌరుడి దిన వేతనంలో వృధాను నిరోధించి, ఆ కుటుంబ జీవన ప్రమాణాల పెరుగుదలకు దాన్ని మళ్ళించడం దీని స్పూర్తి. పౌర సమాజం ప్రభుత్వాలకు సహకరించినప్పుడు మాత్రమే సాధ్యమయ్యే ఆలోచనలివి. 

వాస్తవ పరిస్థితి ఇలా వుంది కనుకే ఇంత గొప్ప ఘన విజయాల తర్వాత కూడా ఎక్కడ విజయోత్సవాలు కనిపించడంలేదు. సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండడంతో  అప్పుడే కొందరు విజేతల మీద నొసలు చిట్లించడం మొదలు పెట్టారు. ఎవరి సంగతి ఏమోగాని, ప్రజలు మాత్రం ఎన్నికల ఫలితాలు తర్వాత మళ్ళీ ‘బిజినెస్ యాజ్ యూజువల్’ అయిపోయారు. అంత మాత్రాన వాళ్ళు దాని సంగతి మర్చిపోయారు అని మాత్రం కాదు. ఎన్నికల ముందు ఏమి చెప్పారు, చెప్పింది ఎంత మేరకు అమలు చేసారు, అని ఇక ఇప్పుడు వాళ్ళు కనిపెడతారు. 

click me!