ఐ ప్యాక్ ప్రశాంత్ కిశోర్ తమకు పనిచేయడం లేదని తెలంగాణ మంత్రి కెటిఆర్ చెప్పారు. నిజానికి, ఐ ప్యాక్ తెలంగాణలో అప్పటి టిఆర్ఎస్ కోసం కొంత క్షేత్ర స్థాయి పనులు చేసింది కూడా. ప్రశాంత్ కిశోర్ కేసిఆర్ తో కలిసి పనిచేయకపోవడానికి బలమైన కారణమే ఉంది.
ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ ప్యాక్ తమతో పనిచేయడం లేదని తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కెటి రామారావు చెప్పారు. నిజానికి, కెసిఆర్ కు ప్రశాంత్ కిశోర్ దూరమై చాలా కాలమే అవుతోంది. కానీ, ఇప్పుడు ఆ విషయాన్ని కెటిఆర్ వెల్లడించారు. అయితే, అందుకు కారణమేమిటనేది ఆయన చెప్పలేదు. గతంలో కొంత కాలం ప్రశాంత్ కిశోర్, కెసిఆర్ మధ్య వరుస సమావేశాలు జరిగాయి. ప్రశాంత్ కిశోర్ తో తాను కలిసి పనిచేస్తున్నట్లు కూడా కెసిఆర్ చెప్పారు. ప్రశాంత్ కిశోర్ తమ మిత్రుడని కూడా ఆయన చెప్పారు.
తెలంగాణ శాసనసభ ఎన్నకల కోసం అప్పటి టిఆర్ఎస్, ఇప్పటి బిఆర్ఎస్ తో కలిసి పనిచేయడానికి, తెలంగాణలో తిరిగి బిఆర్ఎస్ ను అధికారంలోకి తేవడానికి తన సహాయం అందించడానికి ప్రశాంత్ కిశోర్ ముందుకు వచ్చారు. కొంత కాలం తెలంగాణలో ఐ ప్యాక్ పనిచేసింది కూడా. ఆ మేరకు ఒప్పందమేదీ జరగకుండానే తన కార్యాలయం సిబ్బందిని పెంచుకున్నారు. ఇతోధికంగా నియామకాలు జరిగాయి.
undefined
కెసిఆర్ తో విడిపోవడానికి ప్రశాంత్ కిశోర్ కు బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. వచ్చే లోకసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ద్వారా బిజెపిని ఎదుర్కోవడానికి కెసిఆర్ సిద్ధపడ్డారు. బిజెపిపై యుద్ధం సాగిస్తున్నారు. ఇదే విషయంపై ప్రశాంత్ కిశోర్ ముందు కెసిఆర్ తన ప్రతిపాదనను ఉంచినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా తమ పార్టీ సత్తా చాటడానికి తనకు సహకరించాలని ప్రశాంత్ కిశోర్ ను కేసిఆర్ అడిగారు. అయితే, ప్రశాంత్ కిశోర్ అందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. తెలంగాణకు పరిమితమై మాత్రమే తన సహాయం అందిస్తానని ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లు సమాచారం.
బీఆర్ఎస్- ఐ ప్యాక్‌ల మధ్య తెగిన బంధం.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..
లోకసభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రశాంత్ కిశోర్ కు వేరే ప్రణాళికలు ఉన్నాయి. బీహార్ లో ఆయన పార్టీ పెట్టారు. దానికోసం పనిచేస్తున్నారు. ఈ స్థితిలో ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పికె కేసిఆర్ తో లోకసభ ఎన్నికల్లో, ఇతర రాష్ట్రాల్లో కేసిఆర్ తో పనిచేయడానికి అంగీకరించలేదు. దీంతో తెలంగాణ వరకైతే తమకు అక్కరలేదని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కెసిఆర్ కు, ప్రశాంత్ కిశోర్ కు మధ్య ఒప్పందం కుదరలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఐ ప్యాక్ కార్యాలయంలోని సిబ్బందిని చాలా వరకు ప్రశాంత్ కిశోర్ టీమ్ విజయవాడకు పంపించడానికి సిద్ధపడింది. కొంత మందిని ఇప్పటికే పంపించింది కూడా.