తిరుపతిలో బిజెపి దూకుడు: చంద్రబాబును వెనక్కి నెట్టి వైసీపీతో...

By Sirisha SFirst Published Mar 29, 2021, 7:11 PM IST
Highlights

ఈ తిరుపతి ఎన్నిక వల్ల రాష్ట్ర రాజకీయాలు బాగా వేడిగా మారాయన్నది నిర్వివాదాంశం. ఎప్పుడో అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ఉన్న టీడీపీ కన్నా... బీజేపీ జనసేనల మధ్య నెలకొన్న పీటముడి కారణంగా వారికి అధికంగా మీడియా స్పేస్ దొరికింది. ఇప్పుడు తాజాగా బీజేపీ ఆ దొరికిన మీడియా స్పేస్ ని కన్సాలిడేట్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా కనబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి ఉపఎన్నిక ప్రస్తుతం కాకా రేపుతోంది. ఇంకో రోజులో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్థుండనుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. టీడీపీ నుండి పనబాక లక్ష్మి, వైసీపీ నుండి గురుమూర్తి, బీజేపీ - జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ బరిలో ఉన్నారు. 

బీజేపీ జనసేనల మధ్య ఈ సీటు గురించి చాలా చర్చలు నడిచాయి. తామే ఇక్కడ పోటీచేస్తామని తొలుత పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికీ... ఎప్పటిమాదిరే బీజేపీ ఒత్తిడికి తలొగ్గి సీటును బీజేపీకి అప్పగించారు. రాష్ట్రంలో ఈ సీటును గెలిచి రాజకీయ ప్రాధాన్యతను చాటుకోవాలనుకున్న జనసేన, దుబ్బాకను రిపీట్ చేసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న బీజేపీలు ఒకేమాటకు కట్టుబడి రత్నప్రభను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాయి. 

ఇక ఈ తిరుపతి ఎన్నిక వల్ల రాష్ట్ర రాజకీయాలు బాగా వేడిగా మారాయన్నది నిర్వివాదాంశం. ఎప్పుడో అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ఉన్న టీడీపీ కన్నా... బీజేపీ జనసేనల మధ్య నెలకొన్న పీటముడి కారణంగా వారికి అధికంగా మీడియా స్పేస్ దొరికింది. ఇప్పుడు తాజాగా బీజేపీ ఆ దొరికిన మీడియా స్పేస్ ని కన్సాలిడేట్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ పరిస్థితులను చూస్తుంటే అచ్చం తెలంగాణలో జరిగిన సంగతులని గుర్తుకు తెస్తున్నాయి. 

తెలంగాణ రాజకీయాల్లో తెరాస కు గతంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. 2014 ఎన్నికల్లోనైనా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనైనా, ఆఖరికి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రతిపక్షం. కానీ కాంగ్రెస్ కాదు ప్రధాన ప్రతిపక్షం తాము అని నిరూపించుకోదల్చిన బీజేపీ... తెరాస మీద విపరీతంగా దాడి చేసింది. అందుకు తెరాస కూడా ప్రతిదాడికి దిగింది. 

ఈ మొత్తం వ్యవహారంలో మీడియా స్పేస్ మొత్తాన్ని తెరాస, బీజేపీలే పంచుకున్నాయి. తద్ఫలితంగా బీజేపీ అనూహ్యంగా నాలుగు పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో మజ్లీస్ వర్సెస్ బీజేపీగా సాగిన పోరులో బీజేపీకి ఎంత లాభం చేకూరిందో... మీడియా స్పేస్ కోల్పోవడం వల్ల తెరాస కు అంత నష్టం చేకూరింది. 

ఇప్పుడు ఇవే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కనబడుతున్నాయి. తాజాగా "తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు.  ఎవరి పాత్రల్లో వారు జీవించండి...చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం  మళ్లీ వైసీపీనే  దీవిస్తారు." అని సోము వీర్రాజు వీడియోని పోస్ట్ చేసి కామెంట్ చేసారు విజయసాయి రెడ్డి. 

దీనికి సోము వీర్రాజు సైతం అదే స్థాయిలో ఘాటుగా రిప్లై ఇచ్చారు." మా ఊసు ఎందుకులే విజయసాయి రెడ్డి గారు .!!! కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో  తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా.   తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి." అని ట్వీట్ చేసారు అప్ బీజేపీ అధ్యక్షులు. 

ఈ పరిస్థితి చూస్తుంటే ఒకరిపై ఒకరు మాటల దాడి ప్రతిదాడికి దిగడంతో మీడియా స్పేస్ ని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతుంది. వీరి మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధంలో టీడీపీ కనబడకుండా పోవడం వల్ల ప్రధాన ప్రతిపక్ష హోదా తమకే దక్కుతుందని బీజేపీ భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. వేచి చూడాలి ఈ వ్యూహం ఎంతవరకు బీజేపీకి లాభిస్తుందో..!

click me!